ఐర్లాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌ .. 15 మంది ఆటగాళ్లలో ఒకడిగా

21 May, 2021 21:26 IST|Sakshi

లండన్‌: ఐర్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బోయ్డ్ రాంకిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. కాగా బోయ్డ్‌ రాంకిన్‌ క్రికెట్‌లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. రాంకిన్‌ తన కెరీర్‌ను 2007లో ఐర్లాండ్‌ జట్టుతో మొదలుపెట్టాడు. కరీబియన్‌ గడ్డపై జరిగిన 2007 ప్రపంచకప్‌లో రాంకిన్‌ ఐర్లాండ్‌ తరపున 12 వికెట్లు తీసి ఆకట్టుకోవడమే గాక తొలిసారి ఒక మేజర్‌ టోర్నీలో ఐర్లాండ్‌ సూపర్‌-8కు అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. 2012 వరకు ఐర్లాండ్‌కు ఆడిన రాంకిన్‌ ఆ తర్వాత ఇంగ్లండ్‌ తరపున ప్రాతినిధ్యం వహించాడు.

2013లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తరపున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2013-14 ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లోనూ ఇంగ్లండ్‌ తరపున ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇంగ్లండ్‌ జట్టులో అవకాశం రాకపోవడంతో ఇక మీదట ఐర్లాండ్‌కు ఆడనున్నట్లు 2015లో ప్రకటించాడు. అలా బోయ్డ్‌ రాంకిన్‌ తన కెరీర్‌లో ఐర్లాండ్‌ తరపున 75 వన్డేల్లో 106 వికెట్లు, 50 టీ20ల్లో 55 వికెట్లు, 3 టెస్టుల్లో 8 వికెట్లు తీశాడు. సాధారణంగానే మంచి పొడగరి అయిన బోయ్డ్‌ రాంకిన్‌( 6 అడుగుల 8 అంగుళాలు).. బౌన్సర్లు వేయడంలో దిట్ట. 

ఇక రాంకిన్‌ ఒక అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. క్రికెట్‌ చరిత్రలో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన 15 మంది ఆటగాళ్లలో బోయ్డ్‌ రాంకిన్‌ ఒకడిగా నిలిచాడు. ఇక తన రిటైర్మెంట్‌పై బోయ్డ్‌  స్పందించాడు. ''అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవడమనేది ఎప్పుడు కఠినంగానే అనిపిస్తుంది. కానీ రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం. 2003 నుంచి క్రికెట్‌ ఆడుతున్న నేను ఇన్నేళ్ల నా కెరీర్‌లో నిజాయితీతో మనసు పెట్టి ఆడాను. ఇంగ్లండ్‌కు కూడా క్రికెట్‌ ఆడడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. ఇంతకాలం నాకు అండగా నిలిచిన ఐర్లాండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌తో పాటు అభిమానులకు మనస్పూర్తిగా కృతజ్థతలు చెప్పుకుంటున్నా అంటూ'' చెప్పుకొచ్చాడు. ఇక బోయ్డ్‌ రాంకీ సోదరుడు డేవిడ్‌ రాంకిన్‌ కూడా ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
చదవండి: సిక్సర్లు కొట్టడం ఓకే.. కోహ్లి, విలియమ్సన్‌ను చూసి నేర్చుకో

మరిన్ని వార్తలు