హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌ చేస్తారా? బీసీసీఐకి వార్నింగ్‌ ఇచ్చిన ఇర్ఫాన్‌ పఠాన్‌

2 Jan, 2023 15:27 IST|Sakshi

భారత జట్టు టీ20 కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను నియమించడానికి బీసీసీఐ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కాగా స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా వ్యవహారించనున్నాడు. ఇప్పటికే పలు టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్‌గా వ్యవహారించిన హార్దిక్‌ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు.

అదే విధంగా ఐపీఎల్‌ అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌కు టైటిల్‌ను అందించాడు. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు పాండ్యాకు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా.. హార్దిక్‌కు భారత జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తుంటే.. టీమిండియా మాజీ ఆల్‌ రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. హార్దిక్‌ కెప్టెన్సీ పరంగా రాణిస్తున్నప్పటికీ, పూర్తి స్థాయి బాధ్యతలు అప్పజెప్పేముందు కాస్త ఆలోచించాలని సెలెక్టర్లను పఠాన్‌ హెచ్చరించాడు.

"హార్దిక్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్‌ ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు తన కెప్టెన్సీతో అందరిని అకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో కూడా గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా టైటిల్‌ను అందించాడు. అతడి  కమ్యూనికేషన్ చాలా బాగుంది. ఫీల్డ్‌లో చాలా చురుకుగా ఉంటాడు. అయితే  హార్దిక్‌ను దీర్ఘకాలిక కెప్టెన్‌గా నియమించాలని అనుకుంటే మాత్రం అతని ఫిట్‌నెస్‌పై చాలా దృష్టిసారించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫిట్‌నెస్‌ చాలా కీలకం కానుంది" అని  స్టార్ స్పోర్ట్స్‌ షోలో పఠాన్ పేర్కొన్నాడు.
చదవండి: Ind Vs SL 2023: శ్రీలంకతో టీమిండియా సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్‌, జట్లు, ఇతర వివరాలు

మరిన్ని వార్తలు