Irfan Pathan: కెప్టెన్‌ మార్పు వద్దు.. ఇలా చేస్తే టీమిండియాకు తిరుగే ఉండదు..!

17 Nov, 2022 09:01 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో టీమిండియా వైఫల్యం చెందడంతో జట్టు ప్రక్షాళణకు సమయం ఆసన్నమైందని, కెప్టెన్‌ సహా సీనియర్లందరికీ ఉద్వాసన పలికాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో మాజీలు, అభిమానులు, విశ్లేషకులు ఎవరికి తోచిన విధంగా వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ ఆల్‌రౌం‍డర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా స్పందించాడు.

కెప్టెన్‌ను, సీనియర్లను తప్పించి ఉన్నపలంగా జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఇలా చేయడం వల్ల జట్టుకు చాలా నష్టం జరుగుతుందని హెచ్చరించాడు. కెప్టెన్‌ను మార్చాలనే చెత్త ప్రతిపాదనలను బీసీసీఐ అస్సలు పరిగణలోకి తీసుకోకూడదని, రోహిత్‌ టీమిండియా పగ్గాలు చేపట్టి ఓ సంవత్సరం కూడా కాలేదని, ఇంతలోనే కెప్టెన్‌ మార్పు తొందరపాటు నిర్ణయం అవుతుందని బీసీసీఐకి సూచించాడు.

ఈ అంశాన్ని బీసీసీఐ పూర్తిగా పక్కకు పెట్టి, జట్టులో మార్పులపై ఫోకస్‌ పెట్టాలని కోరాడు. జట్టులో మార్పులపై అతనే ఫోర్‌ పాయింట్‌ ఎజెండాను రూపొందించాడు.

మున్ముందు టీమిండియా సక్సెస్‌ సాధిం‍చాలంటే.. 

  • మొదటగా ఓపెనర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాలి, ముఖ్యంగా ఓపెనర్లలో ఒకరు ధాటిగా బ్యాటింగ్‌ చేయాలి.
  • తుది జట్టులో వికెట్‌ టేకింగ్‌ రిస్ట్‌ స్పిన్నర్‌ తప్పక ఉండేలా చూసుకోవాలి
  • కాస్తో కూస్తో బ్యాటింగ్‌ చేయగల నాణ్యమైన ఫాస్ట్‌ బౌలర్‌ తుది జట్టులో ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి
  • ఇప్పటికిప్పుడు కెప్టెన్‌ను మార్చాలనే ఆలోచనను పూర్తిగా విరమించుకోవాలని

పై పేర్కొన్నవన్నీ అమలు చేయగలిగితే టీమిండియాకు తిరుగే ఉండదని ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు అతను ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాలను షేర్‌ చేసుకున్నాడు. 

కాగా, టీమిండియాకు ఇ‍ద్దరు కెప్టెన్లు ఉండాలని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఇటీవలే ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో బీసీసీఐ.. హార్ధిక్‌ను కెప్టెన్‌గా పరిగణిస్తే, అతనితో పాటు మరో స్టాండ్‌ బై కెప్టెన్‌ను కూడా తయారు చేసుకోవాలని సూచించాడు. తరుచూ గాయాల బారిన పడే హార్ధిక్‌ను కెప్టెన్‌గా చేస్తే.. కీలక టోర్నీలకు ముందు అతను గాయపడితే, అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే ఇప్పటి నుంచే ఇద్దరు కెప్టెన్లను లైన్‌లో పెట్టుకుంటే మంచిదని అభిప్రాయపడ్డాడు.   
చదవండి: WC 2024: నేనే చీఫ్‌ సెలక్టర్‌ అయితే ఇలా చేస్తా! ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు!
 

మరిన్ని వార్తలు