#MS Dhoni: ధోనిని అలా చూడలేకపోయా.. నా హృదయం ముక్కలైంది! వైరల్‌ వీడియో

11 May, 2023 15:21 IST|Sakshi
ఎంఎస్‌ ధోని (PC: IPL)

IPL 2023 CSK Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో బ్యాట్‌ ఝులిపించిన చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోని తన అభిమానులకు కావాల్సినంత వినోదం పంచాడు. జట్టు తక్కువ స్కోరుకే పరిమితయ్యే ప్రమాదం పొంచి ఉన్న వేళ తానున్నానంటూ మరోసారి ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. ఆరు వికెట్ల నష్టానికి సీఎస్‌కే 126 పరుగులే చేసిన తరుణంలో క్రీజులోకి వచ్చాడు ధోని.

క్రీజులోకి రాగానే
17వ ఓవర్‌ రెండో బంతికి అంబటి రాయుడును ఖలీల్‌ అహ్మద్‌ అవుట్‌ చేయడంతో ధోని మైదానంలో అడుగుపెట్టాడు. తర్వాతి రెండు బంతుల వరకు ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయిన తలా.. మూడో బంతికి సింగిల్‌ తీశాడు.

దీంతో స్ట్రైక్‌ తీసుకున్న రవీంద్ర జడేజా మరో సింగిల్‌తో ఓవర్‌ ముగించాడు. ఆ తర్వాతి ఓవర్లో జడ్డూ ఒక్కడే 11 పరుగులు స్కోరు చేశాడు. ఈ క్రమంలో 19 ఓవర్‌ వేసిన ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో మూడో బంతికి ధోని సిక్సర్‌ బాది తన పవరేంటో చూపించాడు. 

అలా తెరపడింది
ఆ మరుసటి బంతికి ఫోర్‌ కొట్టిన తలా.. తర్వాత రెండు పరుగులు రాబట్టి.. నెక్ట్స్ బాల్‌కు మరో సిక్స్‌తో చెలరేగాడు. ధోని మెరుపులతో పందొమ్మిదో ఓవర్లో సీఎస్‌కే 21 పరుగులు రాబట్టగలిగింది. అయితే, ఆఖరి ఓవర్‌ రెండో బంతికి జడ్డూను అవుట్‌ చేసిన మిచెల్‌ మార్ష్‌.. ఐదో బంతికి ధోనిని కూడా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ధోని ఇన్నింగ్స్‌కు తెరపడింది. 

అయితే, ఆఖర్లో ధోని మెరుపుల కారణంగా 167 పరుగులు స్కోర్‌ చేసిన సీఎస్‌కే.. బౌలర్ల విజృంభణతో లక్ష్యాన్ని కాపాడుకుని 27 పరుగులతో జయభేరి మోగించింది. దీంతో చెపాక్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఈ మ్యాచ్‌ మొత్తానికి ధోని ఇన్నింగ్స్‌ హైలైట్‌గా నిలిచిందనడంలో సందేహం లేదు.

ధోనిని అలా చూడలేకపోయా
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌, కామెంటేటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ధోనిని ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్‌ చేశాడు. ‘‘వికెట్ల మధ్య ధోని అలా కుంటుతూ పరిగెత్తడం చూసి నా హృదయం ముక్కలైంది. నిజానికి తనను ఎప్పుడూ వేగానికి మారుపేరైన చిరుతలా చూసేవాళ్లం కదా’’ అని పఠాన్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. 

ఇక మ్యాచ్‌ అనంతరం ధోనిని ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోలు పంచుకున్న ఇర్ఫాన్‌ పఠాన్‌ పాత జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయంటూ ట్వీట్‌ చేశాడు. కాగా ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు సీఎస్‌కే హెడ్‌కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పఠాన్‌.. ధోని ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి ఈ మేరకు ట్వీట్‌ చేశాడు.

చదవండి: జట్టుకు పట్టిన దరిద్రం అన్నారు.. ఇప్పుడెమో చుక్కలు చూపిస్తున్నాడు!
సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అంబటి​ రాయుడు

మరిన్ని వార్తలు