క్లీన్‌ షేవ్‌ చేసుకున్న కోహ్లీలా ఉన్నాడు.. ఎవరీ ప్లేయర్‌? 

19 Jul, 2021 16:06 IST|Sakshi

కొలంబో: భారత్‌, శ్రీలంక మ‌ధ్య జ‌రిగిన తొలి వ‌న్డేలో ఓ యువ క్రికెటర్‌ అప్పియరెన్స్‌ అందరి దృష్టిని ఆకర్శించింది. క్లీన్‌ షేవ్‌ చేసుకున్న విరాట్‌ కోహ్లీలా కనిపిస్తూ ఓ కుర్రాడు మైదానంలోకి ప్రవేశించడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అత‌న్ని సడెన్‌గా చూస్తే.. కోహ్లీ ఏంటి ఇక్క‌డ ఉన్నాడు అనిపించ‌క మాన‌దు. చిన్నతనంలో కోహ్లీ ఎలా ఉండేవాడో ఆ ఆటగాడు అచ్చం అలానే కనిపించాడు. ఇక అతను హెల్మెట్‌ పెట్టుకున్నప్పుడు చూస్తే దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌లా కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు తమతమ అభిప్రాయాలను షేర్‌ చేస్తూ విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.  

ఇంత‌కీ కోహ్లీని తలపించిన ఆ ప్లేయ‌ర్ ఎవ‌రని ఆలోచిస్తున్నారా..? అత‌నేననండి టీమిండియా నయా వన్డే వికెట్‌ కీపర్‌ ఇషాన్ కిష‌న్‌. ఈ జార్ఖండ్ వికెట్ కీప‌ర్ నిన్నటి మ్యాచ్‌ ద్వారా వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అంతేకాదు త‌న‌దైన స్టైల్లో కేవ‌లం 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 59 ప‌రుగులు చేశాడు. నిన్ననే తన 23వ పుట్టిన రోజును జరుపుకున్న ఈ డాషింగ్‌ వికెట్‌ కీపర్‌.. కోహ్లీలా దర్శనమిస్తూ నిన్నటి మ్యాచ్‌లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారాడు. 

ఇదిలా ఉంటే, అరంగేట్రం వన్డేలో హాఫ్‌ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్‌ కిషన్‌.. టీ20 అరంగేట్రంలోనూ అర్ధశతకాన్ని బాదాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్‌ పొట్టి ఫార్మాట్‌లోని అడుగుపెట్టాడు. కాగా, నిన్నటి మ్యాచ్లో యువ భారత జట్టు మూకుమ్మడిగా రాణించడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై సునాయాస విజయాన్ని నమోదు చేసింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు