Jasprit Bumrah: ఆరోజు కోహ్లి బుమ్రాతో మాట్లాడతా అంటే నేనే వద్దన్నా! ఎందుకంటే

6 Feb, 2023 14:09 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా (ఫైల్‌ ఫొటో)

Jasprit Bumrah: జస్‌ప్రీత్‌ బుమ్రా.. టీమిండియా తరఫున 2018లో టెస్టుల్లో అడుగుపెట్టాడు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ప్రొటిస్‌ జట్టుతో జరిగిన సిరీస్‌తో అరంగేట్రం చేశాడు. తన మొదటి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఏడాది ముగిసేసరికి తొమ్మిది టెస్టులాడి.. 48 వికెట్లు తన ఖాతాలో వేసుకుని ప్రశంసలు అందుకున్నాడు.

ఈ క్రమంలో, ఆ తర్వాత టెస్టు క్రికెట్‌ ప్రయాణంలో తనకు ఎదురైన సవాళ్లను స్వీకరించిన బుమ్రా.. వాటిని అధిగమించి భారత జట్టులో పేస్‌ దళ నాయకుడిగా ఎదిగాడు. ఇదిలా ఉంటే, 2018-19లో ఆస్ట్రేలియా టూర్‌ సందర్భంగా మొదటి స్పెల్‌ వేసిన బుమ్రా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

కోహ్లి మాట్లాడతా అన్నాడు
దీంతో.. నాటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. బుమ్రా దగ్గరకు వెళ్లి తనతో గేమ్‌ ప్లాన్‌ గురించి చర్చించాలని అనుకున్నాడట. అయితే, అప్పటి కీలక బౌలర్‌ ఇషాంత్‌ శర్మ కోహ్లిని వద్దని వారించాడట. తానెందుకు అలా చేశాననన్న అంశం గురించి ఇషాంత్‌ తాజాగా వెల్లడించాడు. 

క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘బుమ్రా నాయకుడిగా ఎదుగుతాడని నాకెప్పుడో తెలుసు. 2018లో జరిగిన ఘటన నాకింకా గుర్తుంది. మేము ఆస్ట్రేలియాలో టెస్టు ఆడుతున్న సమయంలో తను ఆరంభంలో మెరుగ్గా బౌలింగ్‌ చేయలేకపోయాడు. 

నేను అందుకే వద్దన్నాను
అప్పుడు విరాట్‌ వచ్చి.. ‘‘నేను తనతో మాట్లాడాలనుకుంటున్నా’’ అని చెప్పాడు. వెంటనే నేను వద్దని తనని వారించాను. బుమ్రా తెలివైన బౌలర్‌. పరిస్థితిని అర్థం చేసుకుని అందుకు తగ్గట్లు బౌలింగ్‌ చేయగలడు అని చెప్పాను. బుమ్రా దానిని నిరూపించాడు.

టెస్టు క్రికెట్‌లో పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు బౌల్‌ చేయడం అత్యంత ప్రధానం. బుమ్రా ఆ పని చేసి చూపించాడు’’ అని ఇషాంత్‌ చెప్పుకొచ్చాడు. కాగా 2018-19 నాటి తొలి టెస్టులో బుమ్రా మొత్తంగా 6 వికెట్లతో సత్తా చాటాడు. అడిలైడ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 31 పరుగుల తేడాతో గెలుపొందింది.అదేవిధంగా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

గాయాల బెడద
ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు 30 టెస్టులాడిన బుమ్రా 128 వికెట్లు కూల్చాడు. ఎనిమిది సార్లు ఐదు వికెట్లు కూల్చిన(ఒక మ్యాచ్‌లో) ఘనత సాధించాడు. అయితే, గత కొంతకాలంగా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా.. ఎప్పుడు జట్టులోకి వస్తాడో తెలియని పరిస్థితి.

చదవండి: Ind Vs Aus: భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా.. షెడ్యూల్‌, జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు.. వైట్‌వాష్‌ ఎన్నిసార్లంటే!

>
మరిన్ని వార్తలు