Ishwar Pandey Retirement: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌

13 Sep, 2022 12:10 IST|Sakshi

భారత క్రికెట్‌ జట్టు మాజీ సభ్యుడు, ఐపీఎల్‌ ఆటగాడు, 33 ఏళ్ల మధ్యప్రదేశ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఈశ్వర్‌ పాండే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా సోమవారం (సెప్టెంబర్‌ 12) ప్రకటించాడు. 2014 న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా సభ్యుడిగా ఉన్న ఈశ్వర్‌ పాండే.. భారత్‌ తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడనప్పటికీ, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌, ఐపీఎల్‌ ద్వారా పాపులర్‌ అయ్యాడు. ఈశ్వర్‌ 2014 ఐపీఎల్‌ సీజన్‌లో ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 

ఆ సీజన్‌లో సీఎస్‌కే అతన్ని 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో 25 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టిన ఈశ్వర్‌.. 2013, 2016 సీజన్లలో పూణే జట్టుకు ఆడాడు. ఈశ్వర్‌ 2012-13 రంజీ సీజన్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. కెరీర్‌ మొత్తంలో 75 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 58 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 71 టీ20లు ఆడిన ఈశ్వర్‌.. 394 వికెట్లు (263, 63, 68) సాధించాడు. అప్పట్లో ధోని ఈశ్వర్‌కు వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. అయితే పూర్తిగా ఫామ్‌ కోల్పోయిన అతను క్రమంగా ఐపీఎల్‌ నుంచి కనుమరుగయ్యాడు. 


 

మరిన్ని వార్తలు