Ishwar Pandey: ధోని ఒక్క ఛాన్స్‌ ఇచ్చి ఉంటే నా కెరీర్‌ వేరేలా ఉండేది.. కానీ ఇలా!

14 Sep, 2022 17:58 IST|Sakshi
ఎంఎస్‌ ధోని

Ishwar Pandey On Unfulfilled Team India Dream: టీమిండియా కెప్టెన్‌గా మహేంద్ర సింగ్‌ ధోని హయాంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు.  మిస్టర్‌ కూల్‌ నమ్మకాన్ని గెలుచుకుని.. వరుస అవకాశాలు దక్కించుకుని.. తమను తాము నిరూపించుకుని మేటి ఆటగాళ్లుగా ఎదిగారు. ధోని ప్రోత్సాహంతో తమ రాతను మార్చుకుని జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నారు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, ప్రస్తుత భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆ జాబితాలోని వాళ్లే!

నాకు మాత్రం ఆ అవకాశం రాలేదు!
అయితే, తనకు మాత్రం అలాంటి అదృష్టం దక్కలేదంటున్నాడు మాజీ ఫాస్ట్‌బౌలర్‌ ఈశ్వర్‌ పాండే. తనపై కాస్త నమ్మకం ఉంచి ధోని గనుక తనకు అవకాశం ఇస్తే తన కెరీర్‌ మరోలా ఉండేదని వ్యాఖ్యానించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు ఈ మాజీ పేసర్‌.


ఈశ్వర్‌ పాండే(PC:  Ishwar Pandey Instagram)

ధోని ముందుండి నడిపించిన పుణె సూపర్‌జెయింట్స్‌, పుణె వారియర్స్‌ జట్టులో కూడా భాగమయ్యాడు ఈశ్వర్‌ పాండే. ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తంగా 25 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు తీశాడు. అయితే, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మాత్రం అతడికి అద్భుత రికార్డు ఉంది. 75 మ్యాచ్‌లలో 263 వికెట్లు పడగొట్టాడు. 

కానీ.. టీమిండియా తరఫున ఆడాలన్న తన కోరిక మాత్రం నెరవేరలేదు. 2014లో న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో మాత్రం ఈశ్వర్‌ పాండేకి చోటు దక్కలేదు. దీంతో టీమిండియా నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలనుకున్న అతడి కల కలగానే మిగిలిపోయింది.

ఈ నేపథ్యంలో మంగళవారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు ఈ 33 ఏళ్ల మధ్యప్రదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌. దేశానికి ఆడాలన్న తన చిరకాల కోరిక నెరవేరకుండానే భారమైన, బాధాతప్త హృదయంతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో దైనిక్‌ జాగ్రన్‌తో మాట్లాడిన ఈశ్వర్‌ పాండే చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

ధోని భాయ్‌ ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే..
ఈ మేరకు ఈశ్వర్‌ పాండే మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ ధోని నాకు ఛాన్స్‌ ఇచ్చి ఉంటే నా కెరీర్‌ వేరే విధంగా ఉండేది. అప్పుడు నాకు 23- 24 ఏళ్ల వయసు ఉంటుంది. ఫిట్‌గా కూడా ఉన్నాడు. 

ఆరోజు ధోని భాయ్‌ ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే... నా దేశం కోసం ఆడే అదృష్టం లభించేది. కచ్చితంగా నన్ను నేను నిరూపించుకునేవాడిని. నా కెరీర్‌ అసలు వేరేలా ఉండేది’’ అని వ్యాఖ్యానించాడు. 

అయితే, తన రిటైర్మెంట్‌ ప్రకటనలో సీఎస్‌కే యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఈశ్వర్‌ పాండే.. ధోని, స్టీఫెన్‌ ఫ్లెమింగ్ మార్గదర్శనంలో ఆడటం తనకు ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొనడం గమనార్హం. 
చదవండి: T20 WC 2022: ప్రపంచకప్‌నకు బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన.. మాజీ కెప్టెన్‌పై వేటు
దూసుకొస్తున్న రన్‌ మెషీన్‌.. ఆఫ్ఘన్‌పై సెంచరీతో భారీ జంప్‌

A post shared by Ishwar pandey (@ishwar22)

మరిన్ని వార్తలు