పసిడి పతకాలతో ముగింపు

25 Jul, 2023 06:04 IST|Sakshi

17 పతకాలతో భారత్‌కు రెండో స్థానం

చాంగ్వాన్‌ (కొరియా): ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను భారత షూటర్లు పసిడి పతకాలతో ముగించారు. ఈ టోర్నీ చివరిరోజు సోమవారం భారత్‌కు మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం లభించాయి. పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో కమల్‌జీత్‌ 544 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. కమల్‌జీత్, అంకిత్‌ తోమర్, సందీప్‌ బిష్ణోయ్‌లతో కూడిన భారత జట్టు 50 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో 1617 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది.

మహిళల 50 మీటర్ల పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో టియానా 519 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. టియానా, యశిత షోకీన్, వీర్పాల్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు మహిళల 50 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో 1498 పాయింట్లతో బంగారు పతకాన్ని గెల్చుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భారత షూటర్లు ఓవరాల్‌గా ఆరు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 17 పతకాలతో రెండో స్థానంలో నిలిచారు. 28 పతకాలతో చైనా టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది.

>
మరిన్ని వార్తలు