ఏం చేస్తాం.. మరిచిపోవడం తప్పితే..: వార్నర్‌

25 Oct, 2020 16:02 IST|Sakshi

దుబాయ్‌:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చతికిలబడిన సన్‌రైజర్స్‌ ఓటమి పాలైంది. కింగ్స్‌ పంజాబ్‌ 126 పరుగుల స్కోరును కాపాడుకుని భళా అనిపించింది. చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు చేస్తే విజయం సాధించే దశలో ఆరెంజ్‌ ఆర్మీ తేలిపోయింది.  సన్‌రైజర్స్‌ 24 బంతుల్లో(నాలుగు ఓవర్లలో) 27 పరుగులు చేయాల్సిన తరుణంలో మనీష్‌ పాండే-విజయ్‌ శంకర్‌లు క్రీజ్‌లో ఉన్నారు. కానీ 14 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోవడంతో సన్‌రైజర్స్‌ పరాజయాం పాలైంది. (ధోని చెప్పింది నిజమే కదా.. ఇప్పుడేమంటారు!)

మ్యాచ్‌ తర్వాత ఆరెంజ్‌ ఆర్మీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడుతూ..’ ఇది మమ్మల్ని తీవ్ర గాయం చేసింది. చాలా ఘోరమైన ఓటమి. బ్యాటింగ్‌లో పూర్తిగా తేలిపోయాం. మేము ఒత్తిడిని అధిగమించలేకపోయాం. రానురాను పిచ్‌ కఠినతరం అవుతుందని అనిపించింది. కానీ ఇది స్వల్ప టార్గెట్‌. దాన్ని ఛేదించలేకపోయాం. ఏ దశలోనూ లైన్‌ను దాటలేకపోయాం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి కింగ్స్‌ పంజాబ్‌ను కట్టడి చేశారు. మా బౌలర్ల ప్రదర్శన నిజంగా అసాధారణం. వారు గేమ్‌ ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేశారు. బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలం కావడంతో పరాజయం చెందాం. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకోవడం బాధగా ఉంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను కోల్పోయాం. ఏం చేస్తాం.. మరిచిపోయి ముందుకు సాగడం తప్పితే’ అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు చేస్తే విజయం సాధించే దశలో ఆరెంజ్‌ ఆర్మీ తేలిపోయింది. అర్షదీప్‌ సింగ్‌ వేసిన 18 ఓవర్‌ ఐదో బంతికి విజయ్‌ శంకర్‌(26; 27 బంతుల్లో 4 ఫోర్లు) ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. జోర్డాన్‌ వేసిన 19 ఓవర్‌ మూడో బంతికి హోల్డర్‌(5) ఔట్‌ కాగా, ఆ మరుసటి బంతికి రషీద్‌ ఖాన్‌ డకౌట్‌ అయ్యాడు. దాంతో ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి.ఆ తరుణంలో ‌ చివరి ఓవర్‌ వేసిన అర్షదీప్ పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. దాంతో కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించగా, సన్‌రైజర్స్‌ ఓటమి పాలైంది. 

మరిన్ని వార్తలు