చిర్రెత్తిపోయింది.. అందుకే హిట్టింగ్‌కు దిగా

14 Dec, 2020 12:52 IST|Sakshi

సిడ్నీ:  ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా-ఆసీస్‌ ’ఎ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను భారత్‌ గెలుస్తుందని భావించినా ఆసీస్‌ ’ఎ’ ఆటగాళ్ల పోరాటంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. కానీ ఇక్కడ భారత్‌కు మంచి ప్రాక్టీస్‌ లభించింది. టెస్టు సిరీస్‌కు జట్టును ఎలా ఎంపిక చేయాలనే దానిపై స్పష్టత వచ్చింది. ప్రధానంగా రిషభ్‌ పంత్‌ను ఎంపిక చేయాలా.. వద్దా అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇందుకు కారణం రిషభ్‌ పంత్‌.. హిట్టింగ్‌తో సెంచరీ చేయడమే. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొన్న పంత్.. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో సిడ్నీ వేదికగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేవలం 73 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో అజేయంగా 103 పరుగులు చేశాడు. (విరాట్‌ కోహ్లి తొలి ఆడికారు.. పోలీస్‌ స్టేషన్‌లో)

కాగా, మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం చివరి ఓవర్‌కు ముందు 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న రిషబ్ పంత్.. ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు సాధించి సెంచరీ పూర్తి చేయడం విశేషం. విల్డర్‌ముత్‌ వేసిన ఆఖరి ఓవర్‌ మొదటి బంతి అతని పొట్టలో బలంగా తగిలింది. అనంతరం తర్వాతి ఐదు బంతుల్లో 4, 4, 6, 4, 4 బాదిన పంత్‌ 73 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీపై బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్‌తో పంత్‌ మాట్లాడాడు.  ‘నేను చివరి ఓవర్‌లో 20 పరుగులు చేస్తే సెంచరీ చేస్తాననుకున్నా. కానీ తొలి బంతే నా పొట్టలో బలంగా తగలింది. దాంతో నాకు చిర్రెత్తుకొచ్చింది. ఇక హిట్టింగ్‌కు దిగాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో విహారి కూడా నాకు సపోర్ట్‌గా నిలిచాడు. నువ్వు ట్రై చేస్తే సెంచరీ చేస్తావని చెప్పాడు. నేను తప్పకుండా ట్రై  చేస్తానని చెప్పా. ఒకవేళ సెంచరీ చేస్తే అంతకంటే మంచిది ఉండదనుకున్నా.  దాంతో హిట్టింగ్‌కు దిగి ఆ లక్ష్యాన్ని చేరుకున్నా’ అని పంత్‌ తెలిపాడు. 

>
మరిన్ని వార్తలు