ఆ నిర్ణయం ద్రవిడ్‌దే.. అందువల్లే గెలవగలిగాం: భువీ

21 Jul, 2021 17:51 IST|Sakshi

కొలంబో: ఉత్కంఠ పోరులో ఏడో స్థానంలో బరిలోకి దిగి అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించిన దీపక్‌ చాహర్‌(82 బంతుల్లో 69 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌)పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్న వేళ, టీమిండియా వైస్ కెప్టెన్ భువనేశ్వర్‌ కుమార్‌ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. వికెట్లు వడివడిగా పడుతున్న సమయంలో చాహర్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపాలన్న నిర్ణయం కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌దేని, అందువల్లే తాము మ్యాచ్‌ గెలవగలిగామని తెలిపాడు. మరపురాని ఇన్నింగ్స్‌తో చాహర్‌ ఏడో స్థానానికి న్యాయం చేశాడని ప్రశంసించాడు. 

మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చివరి బంతి వరకు ఆడాలని తాము ముందుగానే నిర్ధేశించుకున్నామని పేర్కొన్నాడు. ద్రవిడ్‌ కోచింగ్‌లో భారత్‌-ఏ తరఫున చాహర్‌ భారీగా పరుగులు చేశాడని, అతడు భారీ షాట్లు ఆడగలడని ద్రవిడ్‌కు ముందే తెలుసని, అందుకే చాహర్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా పంపాడని వెల్లడించాడు. ద్రవిడ్‌ పెట్టుకున్న నమ్మకాన్ని చాహర్‌ కూడా వమ్ము చేయలేదని అన్నాడు. తాను కూడా రంజీల్లో చాహర్‌ బ్యాటింగ్‌ను చూశానని, అందేవల్లే అతనితో సమన్వయం చేసుకోగలిగానని తెలిపాడు. కాగా, చాహర్‌ తన 5 వన్డేల కెరీర్‌లో ఎప్పుడు కూడా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగలేదు.  

ఇదిలా ఉంటే, చాహర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌కు తోడు సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ, భువీ(28 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు)తో కీలక 84 ప‌రుగుల భాగస్వామ్యం తోడవ్వడంతో టీమిండియా మూడు వికెట్లతో శ్రీలంకపై గెలుపొందింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌లో రెచ్చిపోయిన చాహర్‌ (2/53), భువీ(3/54) బౌలింగ్‌లోనూ రాణించారు. ఇరు జట్ల మధ్య నామకార్ధమైన మూడో వన్డే ఇదే వేదికగా శుక్రవారం(జులై 23) జరగనుంది. 
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు