రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్ చేసిన యువ‌రాజ్ సింగ్

30 Apr, 2022 17:14 IST|Sakshi

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌పై మాజీ ఆల్‌రౌండ‌ర్, సిక్స‌ర్ల కింగ్ యువ‌రాజ్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. విరాట్ కోహ్లి టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ ప‌గ్గాలు వ‌దులుకున్న త‌ర్వాత ఆ బాధ్య‌త‌ల‌ను రోహిత్ శ‌ర్మ‌కు అప్ప‌జెప్ప‌డం భావోద్వేగ నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. ఫిట్‌నెస్ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని రోహిత్ శ‌ర్మ‌ను టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా చేశార‌ని, అలా చేయ‌డం అనాలోచిత‌ నిర్ణ‌య‌మ‌ని వ్యాఖ్యానించాడు. 34 ఏళ్ల రోహిత్ గత రెండేళ్లుగా గాయాల బారిన పడుతున్నాడ‌ని, టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు అత‌ని ఫిట్‌నెస్‌పై మ‌రింత ఒత్తిడి పెంచుతాయ‌ని అన్నాడు. రోహిత్‌ టెస్టుల్లో పూర్తి స్థాయి ఓపెన‌ర్‌గా మారి కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యింద‌ని, టెస్ట్ బ్యాట‌ర్‌గా అతను ఇప్పుడిప్పుడే కుదుట‌ప‌డుతున్నాడ‌ని, ఇలాంటి స‌మ‌యంలో బ్యాటింగ్‌పై పూర్తి స్థాయి దృష్టి సారించ‌డం అత‌నికి, టీమిండియాకు ఎంతో అన‌స‌ర‌మ‌ని తెలిపాడు. 

మొత్తంగా టెస్ట్ కెప్టెన్సీ రోహిత్ బ్యాటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌పై కూడా ప్ర‌భావం చూపుంద‌ని కంక్లూడ్ చేశాడు. ఇదే సంద‌ర్భంగా రోహిత్‌ ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్సీపై స్పందిస్తూ.. వైట్ బాల్ క్రికెట్‌లో రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా చాలాకాలం క్రిత‌మే నియ‌మించ‌బ‌డాల్సింద‌ని, అయితే విరాట్ కోహ్లి టీమిండియాను అద్భుతంగా ముందుండి న‌డిపిస్తుండ‌టంతో అది సాధ్య‌ప‌డ‌లేద‌ని పేర్కొన్నాడు. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో రోహిత్ అద్భుత‌మైన నాయ‌కుడ‌ని, ఈ విష‌యాన్ని తాను ఐపీఎల్‌లో అత‌ని సార‌ధ్యంలో ఆడుతుండ‌గా గ్ర‌హించాన‌ని తెలిపాడు. రోహిత్‌ అద్భుతమైన నాయకుడని, అత‌ను చాలా మంచి ఆలోచనాపరుడని, వైట్‌బాల్ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌గా త‌న ఓటు రోహిత్‌కేన‌ని చెప్పుకొచ్చాడు. ఈ మేర‌కు స్పోర్ట్స్ 18 ఛాన‌ల్‌లో జ‌రిగిన ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో యువీ త‌న అభిప్రాయాల‌ను షేర్ చేసుకున్నాడు.
చ‌ద‌వండి: 'అతడు ఫామ్‌లో లేడు.. 15 కోట్ల ఆటగాడిని పక్కన పెట్టండి'
 

మరిన్ని వార్తలు