రిటైర్మెంట్‌పై ఉన్ముక్త్‌ చంద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు 

22 Aug, 2021 17:33 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎంతో ప్రతిభ కలిగి 28 ఏళ్లకే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్న భారత అండర్​-19 జట్టు మాజీ సారధి ఉన్ముక్త్‌ చంద్‌ తాజాగా తన రిటైర్మెంట్‌ నిర్ణయంపై స్పందించాడు. గత రెండేళ్లుగా అవకాశాలు లేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని వాపోయాడు. తాను బయట ఉండి అర్హత లేని XYZలకు అవకాశాలు వస్తుంటే మానసిక క్షోభ అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారణంగానే తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పానని వెల్లడించాడు. తాజాగా ఓ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్ముక్త్‌ మాట్లాడుతూ..

‘గత రెండేళ్లు చాలా కష్టంగా గడిచింది. చివరి సీజన్​లో ఢిల్లీ జట్టు తరఫున ఒక్క మ్యాచ్​ కూడా ఆడే అవకాశం రాలేదు. జట్టు​లోని సహచరులు కనీసం నన్ను గుర్తించలేదు. వారంతా మైదానంలో ఆడుతుంటే.. నేను డగౌట్​కు పరిమితమవ్వాల్సి వచ్చింది. ఒంటరిగా పెవిలియన్​లో కూర్చొవడం మానసిక క్షోభలా అనిపించింది. ఇది మెంటల్​గా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఇక భారత్‌లో తనకు అవకాశాలు రావని నిర్ధారించుకుని రిటైర్మెంట్​ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది' అని ఈ ఢిల్లీ కుర్రాడు చెప్పుకొచ్చాడు.
చదవండి: Anderson-Bumrah: అతనే అండర్సన్‌పైకి బుమ్రాను ఉసిగొల్పి ఉంటాడు..

ప్రస్తుతం యూఎస్​ లీగ్​లో ఆడుతున్న ఉన్ముక్త్.. తన క్రికెట్‌ భవిష్యత్తు కోసం యూఎస్​ను ఎంచుకోవడంపై కూడా స్పందించాడు.  మూడు నెలల క్రితం అమెరికా వెళ్లినప్పుడు అక్కడి క్రికెట్​ను దగ్గరి నుండి చూశానని, అక్కడ పలు మ్యాచ్​లు కూడా ఆడానని, అక్కడి స్థితిగతులపై స్పష్టత వచ్చాకే అక్కడ క్రికెట్‌ ఆడాలనుకుని నిర్ణయించుకున్నాని చెప్పుకొచ్చాడు. అప్పటికే కోరె అండర్సన్, సమిత్‌ పటేల్, హర్మీత్ సింగ్ వంటి అంతర్జాతీయ ప్లేయర్లు యూఎస్​ లీగ్​లలో ఆడుతున్నారని, వారి సలహాలతో తాను కూడా అక్కడి లీగ్‌లలో ఆడాలని నిర్ణయించుకున్నాని వెల్లడించాడు. భారత్‌లో క్రికెట్​కు వీడ్కోలు ప్రకటించాక కాస్త ఉపశమనంగా ఉందని, ఇప్పుడు తాను చేయాల్సిన పనిపై స్పష్టత వచ్చిందని తెలిపాడు.

కాగా, ఉన్ముక్త్‌ చంద్‌.. 2012 అండర్​-19 ప్రపంచకప్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రపంచకప్‌లో ఉన్ముక్త్‌.. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా రాణించాడు. ఆ ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఉన్ముక్త్‌.. వీరోచిత సెంచరీ(111 నాటౌట్‌)తో టీమిండియాను జగజ్జేతగా నిలిపాడు. దాంతో  ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బాటలోనే ఉన్ముక్త్‌ కూడా టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ, ఈ యువ ఆటగాడికి టీమిండియా నుంచే కాదు కనీసం దేశవాళీల్లో కూడా సరైన అవకాశాలు దక్కలేదు. దీంతో అతను విసుగుచెంది భారత్​లో క్రికెట్‌కు వీడ్కోలు పలికి విదేశీ లీగ్​లు ఆడాలని నిర్ణయించుకున్నాడు. 
చదవండి: చెన్నై జట్టులో 'జోష్‌'.. మరింత పదునెక్కిన సీఎస్‌కే పేస్‌ దళం

మరిన్ని వార్తలు