Football Match: తారాస్థాయికి గొడవ.. కొట్టుకున్న ఆటగాళ్లు

21 Jul, 2022 18:08 IST|Sakshi

మాంచెస్టర్‌​ సిటీ, క్లబ్‌ అమెరికా మధ్య బుధవారం అర్థరాత్రి జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ రసాభాసగా మారింది. మెక్సికో లెజెండరీ గోల్‌ కీపర్‌ గిల్లెర్మో ఓచోవా, మాంచెస్టర్‌ సిటీ మిడ్‌ఫీల్డర్‌ జాక్ గ్రీలిష్ దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. ఆట 25వ గోల్‌ కొట్టే సమయంలో జాక్‌ గ్రీలిష్‌కు ఓచోవా అడ్డువచ్చాడు. దీంతో చిర్రెత్తికొచ్చిన జాక్‌ గ్రీలిష్‌కు కిందకు తోశాడు.  ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నావని.. ప్రత్యర్థి జట్టుకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశాడంటూ వాదించాడు.

కిందపడిన ఒచోవాను చూస్తూ పైకి లే అంటూ జాక్‌ గ్రీలిష్‌ కోపంగా అన్నాడు. దీంతో ఒచోవా.. జాక్‌ కాలర్‌ పట్టుకొని అడిగే ప్రయత్నంలో ఉండగానే తోటి ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీశారు. అప్పటికి శాంతించని గ్రీలిష్‌ ఒచోవాను తిడుతూనే ఉన్నాడు. దీంతో ఒచోవా జాక్‌పై కి దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇరుజట్ల ఆటగాళ్లు వచ్చి వారిద్దరిని విడదీశారు. ఆ తర్వాత ఆట రెండో భాగంలోనూ జాక్‌ గ్రీలిష్‌ మరోసారి గొడవపడ్డాడు.

ఈసారి క్లబ్‌ అమెరికా డిఫెండర్‌ బ్రూనో వాల్డెజ్‌ బంతి తన్నే ప్రయత్నంలో జాక్‌ గ్రీలిష్‌ను కింద పడేశాడు. కోపంతో పైకి లేచిన జాక్‌.. వాల్డెజ్‌తో గొడవకు దిగగా.. ఇంతలోనే క్లబ్‌ అమెరికన్‌ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు జాక్‌ను నెట్టివేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మాంచెస్టర్‌ సిటీ 2-1 తేడాతో క్లబ్‌ అమెరికాపై విజయం అందుకుంది. మాంచెస్టర​ సిటీ మిడ్‌ ఫీల్డర్‌ కెవిన​ డిబ్రూయెన్‌ ఆట మొదటి హాఫ్‌లో ఒకటి.. రెండో సగంలో మరొక గోల్‌ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

చదవండి: Shreyas Iyer: జోరుగా వర్షం.. టీమిండియా ఆటగాడి కోసం రెండు గంటల నిరీక్షణ

మరిన్ని వార్తలు