Bumrah: ‘అలసిపోయాను సర్‌.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్‌ చేయనా?’

22 Feb, 2023 11:19 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా (ఫైల్‌ ఫొటో)

India vs Australia- Test Series- Jasprit Bumrah: 2018- 19.. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌.. తొలి టెస్టులో టీమిండియా విజయం.. రెండో టెస్టులో ఆతిథ్య ఆసీస్‌ గెలుపు.. మూడో మ్యాచ్‌లో కోహ్లి సేన ఘన విజయం.. ఇంకొక్క అడుగు పడితే.. ట్రోఫీ గెలిచే అవకాశం..

ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో 9 వికెట్లతో చెలరేగి కంగారూ జట్టు బ్యాటిం‍గ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించిన ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై భారీ అంచనాలు. సిడ్నీలోనూ సత్తా చాటుతాడని అభిమానుల ఆశలు..

అయితే, పిచ్‌ మాత్రం పేసర్లకు మరీ అంత అనుకూలంగా లేదు. దీంతో బుమ్రా కంగారు పడ్డాడు. వెంటనే బౌలింగ్‌ కోచ్‌ దగ్గరికి వెళ్లి కాస్త మొహమాటపడుతూనే తన మనసులో మాట బయటపెట్టాడు.

అలసిపోయాను సర్‌.. నా వల్ల కాదు
‘‘సర్‌.. వికెట్‌ అనుకున్న విధంగా లేదు. ఇక్కడ ఫాస్ట్‌ బౌలర్లు చేయగలిగిందేమీ లేదు. నేను పూర్తిగా అలసిపోయాను. నా శరీరం పూర్తిగా అలసిపోయింది. మానసికంగానూ బలహీనం అయిపోయాను. ప్రస్తుతం నా పరిస్థితి ఇదీ.

పిచ్‌ మరీ డల్‌గా ఉంది. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి నన్నేం చేయమంటారు సర్‌? కాస్త నెమ్మదిగా బౌలింగ్‌ చేయనా? నాకు ఏది సరైంది అనిపిస్తే అలాగే చేయమంటారా?’’ అని భరత్‌ అరుణ్‌ని అడిగాడు.

ఎవరేం చెప్పినా ఓపికగా వినే భరత్‌ అరుణ్‌.. బుమ్రా మాటలను ఆసాంతం విన్నాడు. అయితే, తనేం చెప్పదలచుకున్నాడో పూర్తిగా అర్థమయ్యాక.. బుమ్రాను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. తనదైన వ్యూహాలతో స్వేచ్ఛగా బౌలింగ్‌ చేసేందుకు సమ్మతించాడు.

స్పిన్నర్ల విజృంభణ
బుమ్రా అన్నట్లుగానే సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసిపోయింది. స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై టీమిండియా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 5 వికెట్లతో చెలరేగాడు. పేసర్‌ షమీకి రెండు, స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు దక్కగా.. బుమ్రా ఒక వికెట్‌ మాత్రమే తీయగలిగాడు. ఇ​క ఆసీస్‌ బౌలర్లలో ప్రధాన స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌కు 4 వికెట్లు దక్కాయి. 

టీమిండియా మాజీ కోచ్‌ రామకృష్ణన్‌ శ్రీధర్‌ ఈ మేరకు బుమ్రా- భరత్‌ మధ్య జరిగిన సంభాషణ గురించి తన పుస్తకం.. ‘‘కోచింగ్‌ బియాండ్‌’లో ప్రస్తావించాడు. ముందు మ్యాచ్‌లో అత్యద్భుతంగా ఆడిన బుమ్రా.. మరుసటి మ్యాచ్‌లో ఎలాంటి మానసిక ఆందోళనకు గురయ్యాడో వివరించాడు.

సత్తా చాటిన బుమ్రా.. ఇప్పుడు ఫిట్‌నెస్‌ సమస్యలతో..
కాగా నాటి ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో బుమ్రా మొత్తంగా 21 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీ నుంచి జట్టుకు దూరమైన భారత పేసు గుర్రం బుమ్రా ఇంతవరకు పూర్తి స్థాయిలో జట్టుకు అందుబాటులోకి రాలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఓ మ్యాచ్‌ ఆడినప్పటికీ వెన్నునొప్పి తిరగబెట్టడంతో మరోసారి దూరమయ్యాడు.

స్వదేశంలో ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌కు సైతం బుమ్రా దూరం కావడంతో అతడి ఫిట్‌నెస్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 30 టెస్టులాడిన బుమ్రా 128 వికెట్లు కూల్చాడు. ఎనిమిది సార్లు ఐదు వికెట్లు కూల్చిన(ఒక మ్యాచ్‌లో) ఘనత సాధించాడు.

చదవండి: Women T20 WC: 10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్‌కు
'ఈ సమస్య మన వల్లే'.. ఆలోచింపజేసిన యువీ ట్వీట్‌ 

మరిన్ని వార్తలు