Ravindra Jadeja: 'రాహుల్‌ గెలిపించి ఉండొచ్చు.. కానీ నిన్ను మరువం'

17 Mar, 2023 21:52 IST|Sakshi

ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. లక్ష్యం చిన్నదే అయినప్పటికి టీమిండియా తడబడింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి టాపార్డర్‌ కకావికలం అయింది. 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మధ్యలో పాండ్యా కాస్త ప్రతిఘటించినా రాహుల్‌తో కలిసి 43 పరుగులు జోడించాకా అతను ఔటయ్యాడు.  తనపై వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టేలా ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడాలని కంకణం కట్టుకున్న రాహుల్‌ మాత్రం ఒక ఎండ్‌లో పాతుకుపోయాడు. కానీ అతనికి సహకరించేవారు కరువయ్యారు.

అప్పుడు వచ్చాడు రవీంద్ర జడేజా. ఆల్‌రౌండర్‌గా తానేంటో అందరికి తెలుసు. కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ టీమిండియా కష్టాల్లో ఉంది. ఈ దశలో అతను కూడా ఔటైతే టీమిండియా ఓడడం ఖాయం. కానీ జడేజా అలా చేయలేదు. మరోసారి తన విలువేంటో చూపిస్తూ ఒక మంచి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కెరీర్‌ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌కు సహకరిస్తూ తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 108 పరుగులు జోడించారు.

ఎంత రాహుల్‌ ఆపద్భాందవుడి పాత్రను పోషించి జట్టును గెలిపించినప్పటికి జడేజా లేకపోతే అతను ఆ ఇన్నింగ్స్‌ ఆడేవాడు కాదు.  అందుకే విజయంలో కేఎల్‌ రాహుల్‌ది ఎంత ముఖ్యపాత్రో.. అంతే స్థాయి విలువ జడేజా ఇన్నింగ్స్‌కు ఉంది. మొత్తంగా 69 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 45 పరుగులు నాటౌట్‌గా నిలిచిన జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

కాగా జడ్డూ ఇన్నింగ్స్‌పై అభిమానులు స్పందించారు. ''కేఎల్‌ రాహుల్‌ మ్యాచ్‌ను గెలిపించి ఉండొచ్చు.. కానీ నిన్ను మరువం''.. ''మరోసారి నువ్వేంటో చూపించావు జడేజా.. నీ ఆటకు ఫిదా'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడిన రాహుల్; తొలి వన్డే టీమిండియాదే

KL Rahul: ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్‌.. 

మరిన్ని వార్తలు