జడేజా బంతితో చెలరేగినా.. స్మిత్‌ సెంచరీ కొట్టేశాడు

8 Jan, 2021 09:40 IST|Sakshi

సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 338 పరుగులకు ఆలౌటైంది. 166/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌  ఆరంభించిన ఆసీస్‌ మరో 172 పరుగులు చేసి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు లబూషేన్‌ (91; 196 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీ కోల్పోగా,  స్టీవ్‌ స్మిత్‌(131; 226 బంతుల్లో 16 ఫోర్లు) శతకం సాధించాడు. స్మిత్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండి స్కోరును చక్కదిద్దాడు. ఈ రోజు ఆటలో టీమిండియా బౌలింగ్‌లో రాణించినా స్మిత్‌ మాత్రం శతకంతో ఆకట్టుకోవడంతో ఆసీస్‌ తేరుకుంది.  ఇక మిగతా ఆటగాళ్లలో మిచెల్‌ స్టార్క్‌(24) బ్యాట్‌ ఝుళిపించాడు. తొలి రోజు ఆటలో విల్‌ పకోవ్‌స్కీ (62; 4 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. (తల’ ఎత్తుకునే ప్రదర్శన!)

టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు సాధించగా, సైనీ, బుమ్రాలకు తలో రెండు వికెట్లు లభించాయి. సిరాజ్‌కు వికెట్‌ దక్కింది. నేటి ఆటలో లబూషేన్‌ను ఔట్‌ చేసిన జడేజా.. కాసేటికి మాథ్యూ వేడ్‌(13)ను పెవిలియన్‌కు పంపాడు. దాంతో ఆసీస్‌ 232 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను నష్టపోయింది.  ఆపై కమిన్స్‌, లయన్‌లను వేర్వేరు ఓవర్లలో జడేజా ఔట్‌ చేశాడు. కాగా,  స్మిత్‌ బాధ్యతాయుతంగా ఆడటంతో పాటు అతనికి స్టార్క్‌ నుంచి సహకారం లభించడంతో ఆసీస్‌ తిరిగి గాడిలో పడింది. చివరి వికెట్‌గా స్మిత్‌ ఔటయ్యాడు. రెండో పరుగు తీసి స్ట్రైకింగ్‌ తీసుకుందామని యత్నించే క్రమంలో స్మిత్‌ రనౌట్‌గా నిష్క్రమించడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. స్మిత్‌ను జడేజా రనౌట్‌ చేసిన తీరు ఆకట్టుకుంది. స్వేర్‌ లెగ్‌ నుంచి బంతిని అందుకున్న వెంటనే స్టైకింగ్‌ ఎండ్‌వైపు బంతిని విసిరి నేరుగా వికెట్లను పడగొట్టడంతో స్మిత్‌ ఔటయ్యాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు