IND Vs ENG: సర్ఫరాజ్‌ ఖాన్‌ను ముంచేశాడు.. రోహిత్‌కు నచ్చలేదు!

17 Feb, 2024 12:14 IST|Sakshi
సర్ఫరాజ్‌ ఖాన్‌- రోహిత్‌ శర్మ (PC: BCCI)

టీమిండియా యువ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఉద్దేశించి ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ లాయిడ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు.. మరొకరికి సాయం చేసే క్రమంలో అన్యాయంగా అవుటయ్యాడని పేర్కొన్నాడు.

కాగా రంజీల్లో పరుగుల వరద పారించి.. ఎన్నో రికార్డులు సృష్టించిన ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా అతడు టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు.

ప్రత్యర్థి జట్టు ఎంతటి పటిష్ట బౌలింగ్‌ దళం కలిగి ఉన్నా.. తనకు లెక్కలేదన్నట్లుగా స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించాడు. తొలి రోజు ఆటలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్‌.. 48 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్కు అందుకున్నాడు.

అయితే, దురదృష్టవశాత్తూ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. నిజానికి స్ట్రైకర్‌ ఎండ్‌లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చేసిన తప్పిదానికి సర్ఫరాజ్‌ బలైపోయాడు. పరుగు తీస్తే సెంచరీ పూర్తి చేసుకోవచ్చన తొందరలో లేని పరుగు కోసం జడ్డూ.. పిలుపునివ్వగా సర్ఫరాజ్‌ క్రీజును వీడాడు.

అయితే, బంతిని గమనించిన జడ్డూ మళ్లీ వెనక్కి వెళ్లగా.. అంతలోనే ఫీల్డర్‌ మార్క్‌ వుడ్‌ బాల్‌ను అందుకుని స్టంప్‌నకు గిరాటేశాడు. ఫలితంగా సర్ఫరాజ్ రనౌట్‌ అయ్యాడు.

ఈ ఘటన గురించి ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ లాయిడ్‌ స్పందిస్తూ.. ‘‘తన స్వార్థం కోసం రవీంద్ర జడేజా .. యువ బ్యాటర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ను నాశనం చేశాడు. పాపం.. ఆ యంగ్‌స్టర్‌ సింగిల్‌కు రమ్మనగానే పరిగెత్తాడు.

అంతలో జడేజా తాను వెనక్కి వెళ్లి పోయి, అతడినీ వెళ్లమన్నాడు. వుడ్‌ మాత్రం వేగంగా స్పందించి స్టంప్స్‌ను గిరాటేశాడు. నిజానికి జడ్డూ చేసిన పని రోహిత్‌ శర్మకు ఎంతమాత్రం నచ్చలేదు’’ అని పేర్కొన్నాడు. 

ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్‌ ఖాన్‌ తన కారణంగా రనౌట్‌ అయ్యాడంటూ జడ్డూ మ్యాచ్‌ అనంతరం క్షమాపణలు చెప్పాడు. ఇందుకు బదులుగా.. భయ్యా వల్లే నేను స్వేచ్ఛగా ఆడగలిగానంటూ సర్ఫరాజ్‌.. జడేజాకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ సెంచరీ(112) సాధించాడు. టెస్టుల్లో ఈ ఆల్‌రౌండర్‌కు ఇది నాలుగో శతకం కావడం విశేషం.

చదవండి: Virat Kohli: లండన్‌లోనే ఆ బిడ్డ జననం.. మీకు ఆ హక్కు లేదు! మరీ చెత్తగా..

whatsapp channel

మరిన్ని వార్తలు