అతనికి బౌలింగ్‌ చేస్తే.. అమ్మాయిని ఇంప్రెస్‌ చేసినట్లే

16 May, 2021 19:13 IST|Sakshi

లండన్‌: ఆస్ట్రేలియా క్రికెటర్‌ మార్నస్‌ లబుషేన్‌పై ఇంగ్లండ్‌ సీనియర్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లబుషేన్‌కు బౌలింగ్‌ చేస్తుంటే క్లబ్‌లో అమ్మాయిని ఇంప్రెస్‌ చేసినట్లుగా అనిపిస్తుందంటూ పేర్కొన్నాడు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు యాషెస్‌ సిరీస్‌ను ఎంత సీరియస్‌గా తీసుకుంటాయి. వేరే జట్టుతో మ్యాచ్‌లు ఆడేటప్పుడు గెలిచినా.. ఓడినా పెద్దగా పట్టించుకోరు. కానీ యాషెస్‌ సిరీస్‌లో మాత్రం గెలిచేందుకు కొదమ సింహాల్లా తలపడుతాయి. యాషెస్‌ను ఎవరు దక్కించుకుంటే వారికి మర్యాదలు.. చప్పట్లు అందుతాయి.. ఓడిన జట్టుకు అవమానాలు.. చీదరింపులు ఎదురవుతాయి. అందుకే 1880 నుంచి జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ వీరికి ప్రధానమైన టోర్నీగా పిలవబడుతుంది. అయితే యాషెస్‌కు ఇంకా టైమున్నప్పటికి ఇరు జట్ల ఆటగాళ్లు కౌంటీల్లో ఆడుతూ బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే అండర్సన్‌ కౌంటీ క్రికెట్‌లో లంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంటే.. లబుషేన్‌ గ్లామోర్గాన్స్‌కు ఆడుతున్నాడు. అండర్సన్‌, లబుషేన్‌ ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఎప్పుడు ఎదురుపడలేదు. కౌంటీ క్రికెట్‌లో భాగంగా అండర్సన్‌ తొలిసారి లబుషేన్‌కు బౌలింగ్‌ వేశాడు. లబుషేన్‌ చేసిన 12 పరుగులు అండర్సన్‌ బౌలింగ్‌లో వచ్చినవే. అయితే అండర్సన్‌ వేసిన ఒక అద్భుత ఔట్‌స్వింగర్‌ డెలివరీకి లబుషేన్‌ వెనుదిరిగాడు. లబుషేన్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లిన బంతిని కీపర్‌ విలాస్‌ అందుకున్నాడు. ఇది జరిగిన వారం తర్వాత అండర్సన్‌ లబుషేన్‌ను ఔట్‌ చేయడంపై బీబీసీ పాడ్‌కాస్ట్‌లో స్పందించాడు.

''లబుషేన్‌కు బౌలింగ్‌ చేస్తుంటే నాకు క్లబ్‌లో అమ్మాయిని ఇంప్రెస్‌ చేసినట్లుగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటనేది మాత్రం అడగొద్దు. మేమిద్దరం ఇప్పటివరకు ఎదురుపడలేదు.  2019లో గాయం కారణంగా నేనే యాషెస్‌కు దూరమయ్యాను. అతనికి తొలిసారి బౌలింగ్‌ ఇప్పుడే చేశాను. రానున్న యాషెస్‌లో అతన్ని మళ్లీ కలుస్తా'' అంటూ ముగించాడు. ఇక జేమ్స్‌ అండర్సన్‌ టెస్టుల్లో 600 వికెట్లు పడగొట్టిన తొలి ఇంగ్లండ్‌ బౌలర్‌గా నిలిచాడు. పరిమిత ఓవర్ల ఆటకు ఎప్పుడో దూరమైన అండర్సన్‌ టెస్టుల్లో మాత్రం స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇంగ్లండ్‌ తరపున అండర్సన్‌ 160 టెస్టుల్లో 614 వికెట్లు.. 194 వన్డేల్లో 269 వికెట్లు.. 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.

ఇక మార్నస్‌ లబుషేన్‌ యాషెస్‌ ద్వారానే ఫేమస్‌ అయ్యాడు. స్మిత్‌ స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా రావడం అప్పట్లో చర్చనీయాంశ​మైంది. ఇక లబుషేన్‌ టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ రెండేళ్ల కాలంలో 18 మ్యాచ్‌ల్లో 60.80 సగటుతో 1885 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు.. 10 అర్థసెంచరీలు ఉన్నాయి. యాషెస్‌కు ముందు ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌, టీమిండియాతో సిరీస్‌లు ఆడనుండగా.. ఆసీస్‌ వెస్టిండీస్‌తో సిరీస్‌ ఆడనుంది.
చదవండి: రెచ్చగొట్టి మరీ సిక్స్‌ కొట్టించాడు.. ఎప్పటికి మరిచిపోను
ఆర్చర్‌కు తిరగబెట్టిన గాయం... కోచ్‌ అసహనం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు