అండర్సన్‌@600

26 Aug, 2020 03:42 IST|Sakshi

టెస్టుల్లో 600 వికెట్లు తీసిన తొలి పేస్‌ బౌలర్‌గా గుర్తింపు

ఇంగ్లండ్, పాకిస్తాన్‌ మూడో టెస్టు ‘డ్రా’ ∙సిరీస్‌ ఇంగ్లండ్‌ సొంతం

సౌతాంప్టన్: అందివచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు పడగొట్టిన తొలి పేస్‌ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్‌తో మంగళవారం ‘డ్రా’గా ముగిసిన మూడో టెస్టులో 38 ఏళ్ల అండర్సన్‌ ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్న ముత్తయ్య మురళీధరన్‌ (శ్రీలంక–800 వికెట్లు), షేన్‌ వార్న్‌ (ఆస్ట్రేలియా–708 వికెట్లు), అనిల్‌ కుంబ్లే (భారత్‌–619 వికెట్లు) స్పిన్నర్లే కావడం గమనార్హం. తొలుత వర్షం అంతరాయం... అనంతరం అవుట్‌ఫీల్డ్‌ చిత్తడిగా ఉండటంతో చివరిరోజు రెండు సెషన్‌లలో ఆట సాధ్యపడలేదు.

దాంతో అండర్సన్‌ ఖాతాలో 600వ వికెట్‌ చేరుతుందా లేదా అని ఉత్కంఠ పెరిగింది. అయితే టీ విరామం తర్వాత ఆట ఆరంభం కావడంతో అండర్సన్‌ వికెట్ల వేటపై గురి పెట్టాడు. తాను వేసిన 14వ బంతికి అండర్సన్‌కు వికెట్‌ దక్కింది. పాకిస్తాన్‌ కెప్టెన్‌ అజహర్‌ అలీ (31; 2 ఫోర్లు) ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ స్లిప్‌లో అందుకోవడంతో అండర్సన్‌ ఖాతాలో 600వ వికెట్‌ చేరింది. ఆ తర్వాత అసద్‌ షఫీక్‌ వికెట్‌ను కూడా పాక్‌ కోల్పోయింది. చివరిరోజు ఓవర్‌నైట్‌ స్కోరు 100/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌ 27.1 ఓవర్లు ఆడి మరో 87 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. పాక్‌ స్కోరు 187/4 వద్ద ఉన్నపుడు మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ‘డ్రా’కు అంగీకరించి ఆటను ముగించారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 1–0తో సొంతం చేసుకుంది. జాక్‌ క్రాలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... జాస్‌ బట్లర్, రిజ్వాన్‌ సంయుక్తంగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు గెల్చుకున్నారు. రెండు జట్ల మధ్య ఈనెల 28న మాంచెస్టర్‌లో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ మొదలవుతుంది.  

సంక్షిప్త స్కోర్లు: ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 583/8 డిక్లేర్డ్‌ (154.4 ఓవర్లలో) (జాక్‌ క్రాలీ 267; బట్లర్‌ 162; ఫవాద్‌ ఆలమ్‌ 2/46); పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 273 ఆలౌట్‌ (అజహర్‌ అలీ 141 నాటౌట్‌; అండర్సన్‌ 5/56); పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌: 187/4 (83.1 ఓవర్లలో) (బాబర్‌ ఆజమ్‌ 63 నాటౌట్‌; అజహర్‌ అలీ 42; అండర్సన్‌ 2/45).

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా