వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.. ఇలాంటి బౌలర్‌ భారత్‌కు అత్యవసరం

18 Nov, 2022 21:44 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత టీమిండియాకు కనిపించిన సమస్య.. ఫాస్ట్‌ బౌలర్ల కొరత. బుమ్రా లాంటి మరో బౌలర్‌ మనకు కనిపించడం లేదు. అర్ష్‌దీప్‌ సింగ్‌ కాస్త అలాగే కనిపించినప్పటికి కీలకమైన సెమీఫైనల్లో తేలిపోయాడు. భువనేశ్వర్‌, షమీల సంగతి సరేసరి. అయితే టీమిండియాలో గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసిరే బౌలర్లు తక్కువే.

ఉమ్రాన్‌ మాలిక్‌ వేసే ప్రతీ బంతి గంటకు 150 కిమీ వేగంతోనే ఉంటుంది. ఆస్ట్రేలియా లాంటి ఫాస్ట్‌ పిచ్‌లపై ఇలాంటి బౌలర్లు కచ్చితంగా కావాలి. ఇక యార్కర్ల స్పెషలిస్ట్‌ నటరాజన్‌ కూడా ఆస్ట్రేలియా పిచ్‌లకు సరిగ్గా అతుకుతాడు. కానీ టీమిండియా సెలెక్టర్లకు ఇలాంటి వాళ్లు కనిపించరు. అలాంటి ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌కు సరిసమానంగా గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసురుతున్న మరో ఆణిముత్యం కంటపడ్డాడు. అతనే జమ్మూ కశ్మర్‌కు చెందిన వసీమ్‌ బషీర్‌.

ఎంత లేదన్నా 145 కిమీ వేగంతో బంతులు విసురుతున్న బషీర్‌ ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. తన పదునైన పేస్‌ బౌలింగ్‌తో.. బౌన్సర్లతో ముప్పతిప్పలు పెడుతున్నాడు.  22 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న బషీర్‌కు మంచి భవిష్యత్తు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌ అండర్‌ 25 టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బషీర్‌ను గుర్తించాలంటూ కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. త్వరలో ఐపీఎల్‌ మినీవేలం జరగనున్న నేపథ్యంలో బషీర్‌ను కొనుగోలు చేసే అవకాశముంది. అదే పనిలో టీమిండియాకు కూడా ఇలాంటి బౌలర్లు ఇప్పుడు అత్యవసరంగా మారిపోయారు.

చదవండి: ధోని కొత్త కారులో కేదార్‌ జాదవ్‌, రుతురాజ్‌ల షికారు.

అందం చూపించొద్దన్నారు.. మందు కూడా పాయే; ఏమిటీ కర్మ?

మరిన్ని వార్తలు