FIFA WC 2022: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆకట్టుకున్న జపాన్‌ అభిమానులు

23 Nov, 2022 18:34 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మాములుగా మ్యాచ్‌ చూసేందుకు వచ్చే అభిమానులంతా తమ వెంట తెచ్చుకునే తిను బండారాలు సహా  పేపర్లు, బ్యానర్లు, జెండాలు, పోస్టర్లను మ్యాచ్‌ ముగిశాక అక్కడే వదిలేసి వెళ్తుంటారు. మ్యాచ్‌ పూర్తయ్యాకా చూస్తే స్టేడియంలో చిన్నపాటి చెత్తకుండీ తయారవుతుంది. మ్యాచ్‌ తర్వాత చెత్తను క్లీన్‌ చేయలేక సిబ్బంది నానా అవస్థలు పడుతుంటారు.

తాజాగా ఫిఫా ప్రారంభమైన నవంబర్ 20న ప్రారంభోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఖతర్ - ఈక్వెడార్ మధ్య  మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫలితం పక్కనబెడితే  ఆటముగిశాక  జపాన్ కు చెందిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కొంతమంది స్టేడియం చుట్టూ కలియతిరుగుతూ ఇతర దేశాల ఫ్యాన్స్  పడేసిన చెత్తనంతా సంచుల్లోకి ఎత్తుతూ కనిపించారు. ఖతర్ కు చెందిన ఓ యూట్యూబర్ ఇందుకు సంబంధించిన వీడియోను  సోషల్ మీడియాలో  పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో జపనీయులు స్టేడియంలో  చెత్త ఉన్న  చోటకు వెళ్లి దానిని సంచుల్లో ఎత్తుతూ కనిపించారు.

తమ దేశం మ్యాచ్ కాకపోయినా  ఆట చూడటానికి వచ్చిన జపనీయులు తమ చుట్టూ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా కనిపించేసరికి తట్టుకోలేకపోయారు. జపాన్ ప్రజలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తారు.అక్కడ  రోడ్డు మీద వెళ్తూ చాక్లెట్ తింటే ఆ ప్యాక్ ను  జేబులోనే పెట్టుకుని రోడ్డు మీద ఉన్న  చెత్త డబ్బాల్లో పడేస్తారు. అందుకే జపాన్ లో వీధులు పరిశుభ్రంగా కనిపిస్తాయి. ఇదే సూత్రాన్ని జపాన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఖతర్ స్టేడియంలో కూడా పాటించారు.   

చదవండి: మరొక మ్యాచ్‌ ఓడితే అంతే సంగతి.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్‌ చాన్స్‌ ఎంత? 

మరిన్ని వార్తలు