-

Jarvo 69 Arrested: ఇంగ్లండ్‌ జట్టును వేధిస్తున్న ప్రాంక్‌ స్టార్‌ జార్వో అరెస్ట్‌..

5 Sep, 2021 10:30 IST|Sakshi

లండన్‌: భద్రతా నియమావళిని ఉల్లంఘిస్తూ.. టీమిండియా జర్సీ ధరించి.. మ్యాచ్‌ మధ్యలో మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్‌ ఆటగాళ్లను వేధిస్తున్న ఇంగ్లండ్‌ ప్రాంక్‌ యూట్యూబర్‌ జార్విస్‌ అలియాస్‌ జార్వో 69ను లండన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అతడు పదేపదే భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించి నానా హడావుడి చేస్తున్ననేపథ్యంలో తొలుత మందలింపులతో సరిపెట్టిన ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) తాజాగా లండన్‌ దక్షిణ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జార్వోను అరెస్ట్‌ చేశారు.

'జార్వో 69' పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించే ఈ టీమిండియా అభిమాని ఇప్పటి వరకు మూడుసార్లు(లార్డ్స్ టెస్ట్‌, లీడ్స్‌ టెస్ట్‌, ఓవల్‌ టెస్ట్‌) మైదానంలోకి ప్రవేశించాడు. తాజాగా ఓవల్‌ టెస్ట్‌ రెండో రోజు ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌ చేస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా మైదానంలోకి చొరబడ్డ జార్వో.. తాను టీమిండియా బౌలర్‌ని అంటూ హంగామా చేశాడు. ఈ క్రమంలో నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ బెయిర్‌స్టోను ఢీకొంటూ బంతిని విసిరినట్లుగా యాక్షన్‌ చేశాడు.

ఈ ఘటనతో బెయిర్‌స్టో ఒకింత అసహనానికి గురయ్యాడు. మరో ఎండ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న ఓలీ పోప్‌ కూడా తన ఏకాగ్రత దెబ్బతినిందని అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం సెక్యూరిటీ వచ్చి జార్వోను మైదానం నుంచి తీసుకెళ్లడంతో మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరలయ్యింది. కాగా, లీడ్స్‌ టెస్టు అనంతరం జార్వోపై ఆ స్టేడియం నిర్వాహకులు జీవతకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.  అయినా జార్వో మరోసారి అదే తరహాలో చేయడంతో ఈసీబీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి జార్వో అరెస్ట్‌కు సిఫార్సు చేశారు.


చదవండి: జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్‌ అవతారంలో

మరిన్ని వార్తలు