ఇంగ్లండ్‌ క్రికెట్‌లో జేసన్‌ రాయ్‌ 'కాంట్రాక్ట్‌ కలకలం'

26 May, 2023 13:18 IST|Sakshi
PC: IPL Twitter

ఇంగ్లండ్‌ క్రికెట్‌లో జేసన్‌ రాయ్‌ కాంట్రాక్ట్‌ రద్దు వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యం‍లో తాను ఈసీబీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై రాయ్ స్పందించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈసీబీ కాంట్రాక్ట్‌ వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన మొదటి ప్రాధాన్యత అని తెలిపాడు. తాను ఈసీబీతో కేవలం ఇంక్రిమెంటల్‌ కాంట్రాక్ట్‌ (షెడ్యూల్‌ లేని సమయానికి డబ్బు వదులుకోవడం) మాత్రమే వదులుకున్నట్లు వివరణ ఇచ్చాడు.

ఈసీబీతో తన కాంట్రాక్ట్‌ యధాతథంగా కొనసాగుతుందని, ఇంగ్లండ్‌ షెడ్యూల్‌ లేని సమయంలో తాను మేజర్ లీగ్ క్రికెట్లో ఆడేందుకు ఈసీబీ అధికారులు కూడా అనుమతిచ్చారని, ఈ కాలానికి తనకు ఈసీబీ నుంచి ఎలాంటి రెమ్యూనరేషన్‌ దక్కదని ఇన్‌స్టా వేదికగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్‌ చేశాడు. సింగిల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా అసలు తనకు ఈసీబీతో సెంట్రల్‌ కాంట్రాక్టే లేదని వెల్లడించాడు.

కాగా, అమెరికా వేదికగా జూలై 13 నుంచి జూలై 30 వరకు జరిగే మేజర్ లీగ్ క్రికెట్‌ టోర్నీలో ఆడేందుకు జేసన్ రాయ్‌ ఈసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకుంటున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్‌తో రాయ్‌ రెండేళ్లకు గాను రూ. 36.8 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కథనాలు ప్రసారమయ్యాయి. 

ఇదిలా ఉంటే, 33 ఏళ్ల జేసన్‌ రాయ్‌ను ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ 2 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ 2023 మధ్యలో కేకేఆర్‌ టీమ్‌లో చేరిన రాయ్‌.. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 151కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో 285 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. 

చదవండి: ఐపీఎల్‌లో 18.50 కోట్లు పెడితే ఏం చేయలేకపోయాడు.. అక్కడికి వెళ్లగానే..?

మరిన్ని వార్తలు