వేలంలో అమ్ముడుపోలేదు.. దానికే బాధపడాలా!

19 Feb, 2021 20:46 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌ మినీ వేలంలో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు. దీంతో రాయ్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో అన్‌సోల్డ్‌ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ విషయంపై జేసన్‌ రాయ్‌ ట్విటర్ ద్వారా స్పందించాడు.

'ఐపీఎల్‌ మినీ వేలంలో అమ్ముడుపోనందుకు నేనేం బాధపడట్లదు.. అలా అని అవమానభారంగాను ఫీలవ్వను. నా ప్రదర్శన వారిని మెప్పించలేదు.. అందుకే సెలెక్ట్‌ కాలేకపోయాను. ఈ విషయం గురించి ఆలోచించనవసరం లేదు. అయితే వేలంలో మంచి ధర దక్కించుకున్న ఆటగాళ్లకు నా అభినందనలు. ముఖ్యంగా జేమిసన్‌, క్రిస్‌ మోరిస్‌, మ్యాక్స్‌వెల్‌ లాంటి వారు అధిక ధరకు అమ్ముడుపోవడం మంచి పరిణామం. నేను ఈ ఐపీఎల్ ఆడకపోవచ్చు.. కానీ మ్యాచ్‌లన్నీ కచ్చితంగా చూస్తా' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా గత ఐపీఎల్‌ 2020 సీజన్‌లో జేసన్‌ రాయ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ గాయం కారణంగా రాయ్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో ఢిల్లీ అతని స్థానంలో డేనియల్‌ సామ్స్‌కు అవకాశం ఇచ్చింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ రాయ్‌ను రిలీజ్‌ చేయగా.. వేలంలో అతన్ని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. మరోవైపు అతని సహచర ఆటగాడు మొయిన్‌ అలీకి మాత్రం వేలంలో మంచి ధర దక్కింది. ఆర్‌సీబీ రిలీజ్‌ చేసిన అలీని సీఎస్‌కే అనూహ్యంగా రూ.7కోట్లకు కొనుగోలు చేసింది.

ఇక మిగిలిన విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే 16.25 కోట్లకు రాజస్తాన్‌కు అమ్ముడుపోగా.. న్యూజిలాండ్ బౌలర్‌ కైల్‌ జేమిసన్‌ 15 కోట్లు(ఆర్‌సీబీ), ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ రూ. 14.25 కోట్లు(ఆర్‌సీబీ), జై రిచర్డ్‌సన్‌ రూ.14 కోట్లు(పంజాబ్‌ కింగ్స్‌) దక్కించుకున్నాయి. 
చదవండి: 'రోహిత్‌, పాండ్యా గట్టిగా హగ్‌ చేసుకున్నారు'

మరిన్ని వార్తలు