ఉనద్కత్ పై బీసీసీఐ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు

26 May, 2021 14:40 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవాళీ స్టార్ ఆటగాడు, ప్రస్తుత రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ కు సంబంధించిన సంచలన విషయాలను సౌరాష్ట్ర కోచ్ కర్సన్ గావ్రి వెల్లడించాడు. టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్, 7 వన్డేలు, 10 టీ20లు ఆడిన ఉనద్కత్ .. ఇకఫై ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడని, ఈ విషయాన్ని సాక్షాత్తు బీసీసీఐ సెలెక్టరే తనతో చెప్పాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.  2019-20 రంజీ సీజన్లో ఏకంగా 67 వికెట్లు పడగొట్టి  సౌరాష్ట్రను తొలిసారి ఛాంపియన్ గా నిలబెట్టిన 30 ఏళ్ల ఉనద్కత్ పై సెలెక్టర్లు ఇలాంటి అభిప్రాయాన్ని కలిగివుండటాన్ని ఆయన తప్పు బట్టాడు. వయసును బూచిగా చూపి ఉనద్కత్ ను జాతీయ జట్టుకు ఎంపిక చేయలేకపోవడమన్నది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు.

రంజీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (ఒక సీజన్లో) సాధించిన ఆటగాడిని కనీసం భారత 'ఏ' జట్టులోకి కూడా తీసుకోకపోవడం బాధాకరమన్నాడు. దేశవాళీ క్రికెట్లో ప్రదర్శన తిరిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించి పెడుతుందని ఉనద్కత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని, వాటిపై సెలెక్టర్లు నీళ్లు చల్లేలా ఉన్నారని విచారం వ్యక్తం చేశాడు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనకు ఉనద్కత్ ను ఎంపిక చేస్తారని తానూ కూడా ఆశగా ఎదురు చూశానన్నాడు.  ఉనద్కత్ తన ఏకైక టెస్ట్ మ్యాచ్ ను 2010లో ఆడాడని, అప్పటి నుంచి జట్టులో స్థానం కోసం కఠోరంగా శ్రమించాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఫాస్ట్ బౌలర్లలో షమీ, సైనీ, నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్నాడు.          
చదవండి: రోహిత్ భాయ్ వల్లే ఐపీఎల్ ఎంట్రీ.. అంతా అతని చలువే

మరిన్ని వార్తలు