Womens ODI World Cup 2022: జెమీమా, శిఖాలపై వేటు.. కెప్టెన్‌గా మిథాలీ రాజ్‌

7 Jan, 2022 09:50 IST|Sakshi

ముంబై: భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం, హైదరాబాదీ మిథాలీ రాజ్‌ వరుసగా మూడో వన్డే వరల్డ్‌ కప్‌లో జట్టుకు సారథ్యం వహించనుంది. మిథాలీ నాయకత్వంలో వచ్చే ప్రపంచకప్‌ బరిలోకి దిగే 15 మంది సభ్యుల భారత జట్టును సెలక్టర్లు గురువారం ప్రకటించారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. 2017లో మిథాలీ కెప్టెన్సీలోనే ఆడిన టీమ్‌ హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో 9 పరుగులతో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మార్చి 4నుంచి ఏప్రిల్‌ 3 వరకు న్యూజిలాండ్‌ వేదికగా వరల్డ్‌ కప్‌ జరుగుతుంది. మార్చి 6న తౌరంగాలో జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్‌ తలపడుతుంది. అంతకు ముందు టోర్నీకి సన్నాహకంగా భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ ఆడనుంది.  

పేలవ ఫామ్‌ కారణంగానే... 
గత కొంత కాలంగా భారత జట్టులో రెగ్యులర్‌ సభ్యులుగా ఉన్న బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్, పేసర్‌ శిఖా పాండేలకు జట్టులో చోటు దక్కలేదు. గత ఏడాది ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో జెమీమా ఒక్కసారి కూడా రెండంకెల స్కోరు చేయకపోగా, శిఖా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. టి20ల్లో ఆకట్టుకున్న మేఘనా సింగ్, రేణుకా సింగ్‌లను తొలిసారి వన్డే టీమ్‌లోకి ఎంపిక చేశారు. గత ప్రపంచకప్‌లో ఆడిన పూనమ్‌ రౌత్‌కు కూడా ఈ సారి స్థానం లభించలేదు. 2021 చాలెంజర్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆంధ్ర ప్లేయర్‌ సబ్బినేని మేఘనను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు వన్డేలు ఆడని మేఘన 6 టి20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.  

జట్టు వివరాలు: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (వైస్‌ కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), తానియా భాటియా (వికెట్‌ కీపర్‌), స్నేహ్‌ రాణా, పూజ వస్త్రకర్, జులన్‌ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్, పూనమ్‌ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్‌. స్టాండ్‌బై: సబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్, సిమ్రన్‌ బహదూర్‌.

చదవండి: SA vs IND: కోహ్లి గాయంపై కీలక ప్రకటన చేసిన ద్రవిడ్‌..

మరిన్ని వార్తలు