కోహ్లితో సంభాషణ.. ఆటతీరు మొత్తం మారిపోయింది

28 Jan, 2021 16:57 IST|Sakshi

జమైకా: గతేడాది జూన్‌ 2020లో వెస్టిండీస్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా టెస్టు సిరీస్‌ తర్వాత పర్యటన రద్దైంది. అయితే మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-1 తేడాతో గెలుచుకుంది. కానీ సిరీస్‌లో మొదటి టెస్టును విండీస్‌ జట్టు గెలిచి అప్పట్లో సంచలనానికి తెరదీసింది. దీనికి ప్రధాన కారణం.. విండీస్‌ వైస్‌ కెప్టెన్‌ జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌. మొదటి టెస్టులో ఓటమి దిశగా పయనిస్తున్న విండీస్‌ను బ్లాక్‌వుడ్‌ తన బ్యాటింగ్‌తో విజయతీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్‌లో 154 బంతుల్లో 95 పరుగులు చేసిన బ్లాక్‌వుడ్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విండీస్‌ క్రికెటర్లలో దాదాపు అందరూ పొడుగ్గా ఉంటే .. బ్లాక్‌వుడ్‌ మాత్రం చాలా పొట్టిగా ఉంటాడు. ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు గెలిచిన తర్వాత బ్లాక్‌వుడ్‌ను అందరూ పొట్టోడు చాలా గట్టోడు అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల్లోనూ మంచి ప్రదర్శన కనబరిచిన బ్లాక్‌వుడ్‌ మొత్తం రెండు హాఫ్‌ సెంచరీల సాయంతో 211 పరుగులు సాధించాడు.

తాజాగా ఇంగ్లండ్‌ సిరీస్‌లో రాణించడంపై ఒక వ్యక్తి కారణమంటూ జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ ఇన్నాళ్ల తర్వాత స్పందించాడు. ఇంతకీ బ్లాక్‌వుడ్‌ను ఇన్‌స్పైర్‌ చేసిన ఆ వ్యక్తి ఎవరో​ తెలుసా.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు 2019లో  టీమిండియా విండీస్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లతో పాటు రెండు టెస్టులు ఆడింది. అయితే బ్లాక్‌వుడ్‌ ఒక మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న కోహ్లితో కాసేపు మాట్లాడాడు. సుధీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాలంటే చాలా బంతులను ఎదుర్కోవాలని కోహ్లి సూచించినట్లు బ్లాక్‌వుడ్‌ తెలిపాడు.చదవండి: బౌన్సర్లు ఎదుర్కోలేమంటే ఆడడం ఎందుకు?

'2019లో టీమిండియా మా దేశంలో పర్యటించినప్పుడు కోహ్లితో మాట్లాడేందుకు ప్రయతించా. అంతకముందు సోషల్‌ మీడియా వేదికగా కోహ్లితో పలుసార్లు చాట్‌ చేశాను. జమైకాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్‌ సమయంలో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా వ్యవహరించాను. ఆట ముగిసిన తర్వాత కోహ్లితో చిన్న సంభాషణ జరిగింది. నేను సెంచరీలు, అర్థసెంచరీలు చేయాలంటే ఎలా ఆడాలో చెప్పాలంటూ కోహ్లిని అడిగాను.. దానికి టెస్టులో సెంచరీ చేయాలంటే ఎన్ని బంతులు ఎదుర్కోవాలో చెప్పగలవా.. అంటూ నన్ను ప్రశ్నించాడు. నేను సుమారు 212 బంతులు ఎదుర్కొంటే సెంచరీ చేసే అవకాశం ఉంటుంది అని సమాధానమిచ్చాను. నువ్వు చెప్పిన జవాబులో  అర్థం ఉంది.. అంటే ఎన్ని బంతులు సమర్థంగా ఆడగలిగితే అన్ని సెంచరీలు చేయొచ్చు అని కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లితో సంభాషణ తర్వాత నా ఆటతీరు పూర్తిగా మారిపోయింది. టెస్టు మ్యాచ్‌లో ఆడితే కనీసం 200- 300 బంతులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా... దాని ఫలితమే నాకు ఇంగ్లండ్‌ పర్యటనలో కనిపించింది.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా విండీస్‌ తరపున బ్లాక్‌వుడ్‌ ఇప్పటివరకు 33 టెస్టులాడి 1789 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు.. 13 అర్థసెంచరీలు ఉన్నాయి.చదవండి: 'పైన్‌ను తీసేయండి.. అతన్ని కెప్టెన్‌ చేయండి'

మరిన్ని వార్తలు