కరోనా కాటు: ఇటుకల బట్టీలో ఫుట్‌బాల్‌ కెప్టెన్‌

23 May, 2021 14:34 IST|Sakshi

వెబ్‌డెస్క్‌: పైన ఫొటోలో ఉ‍న్న అమ్మాయి పేరు సంగీతా సోరెన్‌. ఊరు జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లా బాసమూది. వయసు ఇరవై ఏళ్లు. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఇలా ఇటుకల బట్టీలో పనిచేస్తుంది. లేకుంటే ఆపాటికి ఫుట్‌బాల్‌ స్టార్‌గా వెలిగిపోయేదేమో!

అవును.. సంగీత మంచి ఫుట్ బాల్‌ ప్లేయర్‌. 2018–19లో భూటాన్, థాయ్ లాండ్ లో జరిగిన అండర్17,అండర్‌18 పోటీలకు కెప్టెన్‌గా వ్యవహరించింది. మంచి పర్‌ఫార్మెన్స్‌తో సీనియర్ టీమ్‌కు సెలక్ట్‌ అయ్యింది. టీంలో చేరుతుందనుకున్న టైంకి కరోనా మహమ్మారి వచ్చిపడింది. కుటుంబం ఆర్థిక స్థితి బాగోలేదు. పైగా ఆమె తండ్రి దూబా సోరెన్ కు కళ్లు లేవు. కూలి పనిచేసి జీవితాన్ని నెట్టుకొచ్చే అన్నకు.. లాక్‌డౌన్‌  ప్రభావంతో పని దొరకడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ భారాన్ని తానే మోస్తోంది సంగీత.

 

ప్రాక్టీస్‌ ఆపలేదు
తల్లితో కలిసి బట్టీలో ఇటుకలు మోసే పనిచేస్తోంది సంగీత. ఫుట్‌బాల్‌ కెప్టెన్‌గా రాణించిన సంగీతకు ప్రోత్సాహం అందిస్తామని, ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గతంలో ప్రకటించాడు. ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా తమను సంప్రదించలేదని ఆమె తండ్రి దూబా వాపోయాడు. జార్ఖండ్‌లో మంచి ప్లేయర్స్‌ ఉన్నారని, ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని సంగీత అంటోంది. అయినప్పటికీ తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఫుట్ బాల్‌ను వదిలేది లేదని చెబుతోంది. పనికి పోయే ముందు రోజూ ఉదయం పొలాల్లో సంగీత తన ఆటకు మెరుగులు దిద్దుకుంటోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు