‘ప్రపంచకప్‌ గెలవకపోవడమే లోటు’

24 Sep, 2022 04:26 IST|Sakshi

 జులన్‌ గోస్వామి వ్యాఖ్య 

నేడు ఆఖరి మ్యాచ్‌ ఆడనున్న పేస్‌ దిగ్గజం

లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ చివరి వన్డే  

లండన్‌: రెండు దశాబ్దాలకు పైగా భారత మహిళా క్రికెట్‌ మూలస్థంభాల్లో ఒకరిగా నిలిచిన దిగ్గజ పేస్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి ఆటకు ముగింపు పలుకుతోంది. నేడు భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగే చివరి వన్డేతో రిటైర్‌ కానున్న జులన్‌ ఆఖరిసారిగా లార్డ్స్‌ మైదానంలో బరిలోకి దిగనుంది. భారత్‌ ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న నేపథ్యంలో అందరి దృష్టీ జులన్‌పైనే ఉంది. ఆమెకు విజయంతో ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని హర్మన్‌ బృందం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో తన కెరీర్‌ విశేషాల గురించి జులన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడింది. వన్డే లేదా టి20 ప్రపంచకప్‌లలో తాము ఒకటి గెలిచి ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించింది. ‘2005, 2017 వన్డే వరల్డ్‌కప్‌లలో మేం ఫైనల్‌ చేరాం. వీటిలో ఒకటి గెలిచి ఉండాల్సింది. ప్రతీ క్రికెటర్‌కి అదే లక్ష్యం ఉంటుంది. నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడి అక్కడి దాకా వచ్చాక కప్‌ గెలిస్తే కల నిజమయ్యేది. టి20 ప్రపంచకప్‌ సహా మేం మూడు ఫైనల్స్‌ ఆడినా ఒక్కటి గెలవలేకపోయాం. అది చాలా బాధిస్తుంది.

నా కెరీర్‌లో అదే లోటు’ అని జులన్‌ చెప్పింది. గత రెండేళ్లుగా చాలా సార్లు రిటైర్మెంట్‌ గురించి ఆలోచిస్తూ వచ్చానని, చివరకు ఇప్పుడు తప్పుకుంటున్నానని జులన్‌ భావోద్వేగంతో చెప్పింది. ‘రెండేళ్లుగా ప్రతీ సిరీస్‌ నాకు చివరి సిరీస్‌లాగానే అనిపించేది. కోవిడ్‌ వల్ల మ్యాచ్‌లు వాయిదాపడుతూ రావడంతో పాటు వరుసగా గాయాలపాలయ్యాను. శ్రీలంక సిరీస్‌తోనే ముగిద్దామనుకున్నా. అయితే ఫిట్‌గా లేక ఆ సిరీస్‌ ఆడలేదు. దాంతో మళ్లీ ఎన్‌సీఏకు వెళ్లాను.

రాబోయే టి20 వరల్డ్‌కప్‌కు ముందు ఇదే చివరి వన్డే సిరీస్‌ కాబట్టి ఆటను ముగిస్తున్నా’ అని ఈ బెంగాల్‌ పేసర్‌ పేర్కొంది. కోల్‌కతాలో 1997 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో బాల్‌బాయ్‌గా పని చేసిన తర్వాత దేశానికి ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇన్నేళ్లు కొనసాగగలనని అనుకోలేదన్న జులన్‌... కెరీర్‌లో తొలి మ్యాచే అన్నింటికంటే ప్రత్యేకమైందని గుర్తు చేసుకుంది. వచ్చే ఏడాది జరి గే తొలి మహిళల ఐపీఎల్‌లో పాల్గొనడం గురించి తాను ఇప్పుడే చెప్పలేనని జులన్‌ స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు