Jhulan Goswami: టీమిండియా సీనియర్‌ పేసర్‌ రీఎంట్రీ.. లార్డ్స్‌లో ఫేర్‌వెల్‌ మ్యాచ్‌!

20 Aug, 2022 13:51 IST|Sakshi

ఇంగ్లండ్‌ గడ్డపై మూడు టి20లు, 3 వన్డేల్లో తలపడే భారత మహిళల జట్టును సెలక్టర్లు గురువారం ప్రకటించారు. గత శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉండి రిటైర్మెంట్‌పై అనుమానాలు పెంచిన సీనియర్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి ఇప్పుడు జట్టులోకి పునరాగమనం చేయడం విశేషం. అయితే ఇదే సిరీస్‌లో సెప్టెంబర్‌ 24న లార్డ్స్‌ వేదికగా జరగనున్న మూడో వన్డే ఆమెకు ఆఖరి మ్యాచ్‌ కానుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ప్లాన్‌లో భాగంగానే ఝులన్‌ గోస్వామికి వీడ్కోలు మ్యాచ్‌ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఇక 39 ఏళ్ల ఝులన్‌ గోస్వామి 2018లో టి20 క్రికెట్‌ నుంచి తప్పుకొని కేవలం వన్డేలకు పరిమితమైంది. మహిళా క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌లో 200, 250 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా ఝులన్‌ గోస్వామి చరిత్ర సృష్టించింది.  2007లో ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైన ఝులన్‌ గోస్వామి 2008 నుంచి 2011 వరకు టీమిండియా మహిళా జట్టుకు నాయకత్వం వహించింది. ఇక ఝులన్‌ గోస్వామి టీమిండియా తరపున 12 టెస్టుల్లో 291 పరుగులు.. 44 వికెట్లు, 199 వన్డేల్లో 1226 పరుగులు.. 250 వికెట్లు.. 68 టి20ల్లో 405 పరుగులు.. 56 వికెట్లు పడగొట్టింది.

ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఏడాది తర్వాత వన్డే టీమ్‌లో జెమీమా రోడ్రిగ్స్‌కు చోటు దక్కగా, దేశవాళీ క్రికెట్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటిన నాగాలాండ్‌ బ్యాటర్‌ కిరణ్‌ ప్రభు నవ్‌గిరేకు తొలిసారి భారత టి20 జట్టులో చోటు లభించింది. రెండేళ్ల తర్వాత హేమలత మళ్లీ వన్డే టీమ్‌కు ఎంపిక కాగా, లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌కు రెండు టీమ్‌లలోనూ స్థానం లభించలేదు. ఆంధ్ర క్రికెటర్‌ సబ్బినేని మేఘన వన్డే, టి20 టీమ్‌లలోనూ అవకాశం దక్కించుకోగలిగింది.  

చదవండి: అంపైర్ల నియామకానికి రాత పరీక్ష.. పిచ్చి ప్రశ్నలతో విసిగించిన బీసీసీఐ

Eugenie Bouchard: ఐడీకార్డుపై బికినీతో ఫోటో.. షాకైన టెన్నిస్‌​ స్టార్‌

మరిన్ని వార్తలు