సెంచరీతో ఆదుకున్న రూట్‌

25 Jan, 2021 04:41 IST|Sakshi

గాలె: శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మూడోరోజు ఆటలో లంక లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ లసిత్‌ ఎంబుల్‌డేనియా (7/132), కెరీర్‌లో 99వ టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ (309 బంతుల్లో 186; 18 ఫోర్లు)ల పోరాటం హైలైట్‌గా నిలిచింది. లసిత్‌ స్పిన్‌ ధాటికి సహచరులంతా పరుగులు చేయడానికి తడబడుతుంటే... అతన్ని సమర్థంగా ఎదుర్కొన్న జో రూట్‌ వరుసగా రెండో టెస్టులో శతకాన్ని నమోదు చేశాడు. దీంతో 98/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ ఆటముగిసే సమయానికి 9 వికెట్లకు 339 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఇంకా 42 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్‌ స్కోరు 67తో ఆదివారం బరిలో దిగిన రూట్‌ టెస్టుల్లో 19వ సెంచరీని సాధించాడు.

దీంతోపాటు ఇంగ్లండ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు (8,238) చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరాడు. తొలి మూడు స్థానాల్లో అలిస్టర్‌ కుక్‌ (12,472), గ్రాహమ్‌ గూచ్‌ (8,900), అలెక్‌ స్టీవార్ట్‌ (8,463) ఉన్నారు. జాస్‌ బట్లర్‌ (55; 7 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.  కెరీర్‌లో తొమ్మిదో టెస్టు ఆడుతోన్న ఎంబుల్‌డేనియా ఈ మ్యాచ్‌లో స్యామ్‌ కరన్‌ (13) వికెట్‌తో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఘనతను మూడోసారి అందుకున్నాడు. ఆ తర్వాత డామ్‌ బెస్‌ (32; 4 ఫోర్లు), మార్క్‌ వుడ్‌ (1)లను కూడా పెవిలియన్‌ పంపి తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. శ్రీలంక ప్లేయర్‌ తిరిమన్నె ఐదు క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా వికెట్‌ కీపర్లు కాకుండా టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన శ్రీలంక ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు