‘రూట్‌’ అందించిన ఆధిక్యం

15 Aug, 2021 04:40 IST|Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 391 ఆలౌట్‌

27 పరుగుల స్వల్ప ఆధిక్యం

జో రూట్‌ 180 నాటౌట్‌

సిరాజ్‌కు 4 వికెట్లు

స్వల్పమే అయినా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం చేజారింది. అయితే ఇంగ్లండ్‌ను మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలగడమే మూడో రోజు ఆటలో భారత్‌కు ఊరటనిచ్చే అంశం. తొలి రెండు సెషన్లలో ఇంగ్లండ్‌ జోరు చూపించినా... చివరి సెషన్లో చెలరేగిన భారత బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. సహచరుల నుంచి చెప్పుకోదగ్గ సహకారం లభించకపోయినా కెప్టెన్‌ జో రూట్‌ అద్భుత బ్యాటింగ్‌తో నిలవడం శనివారం ఆటలో హైలైట్‌ కాగా... టీమిండియా తరఫున సిరాజ్, ఇషాంత్‌ తమ ముద్ర చూపించారు.

లండన్‌: ‘లార్డ్స్‌’ టెస్టులో ఇంగ్లండ్‌కు 27 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ దక్కింది. ఓవర్‌నైట్‌ స్కోరు 119/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (321 బంతుల్లో 180 నాటౌట్‌; 18 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 57; 7 ఫోర్లు) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్‌ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఆట ముగిసింది.  

శతక భాగస్వామ్యం...
తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో ఓవర్లోనే రూట్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్‌ తీయడంలో విఫలమయ్యారు. చూస్తుండగానే నాలుగో వికెట్‌ భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. ఆ వెంటనే బెయిర్‌స్టో అర్ధ సెంచరీ కూడా పూర్తయింది. ఈ సెషన్‌లో ఇంగ్లండ్‌ 97 పరుగులు చేయడం విశేషం. అయితే లంచ్‌ తర్వాత భారత్‌కు బ్రేక్‌ లభించింది. సిరాజ్‌ బౌలింగ్‌లో పుల్‌ షాట్‌ ఆడబోయిన బెయిర్‌స్టో స్లిప్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రూట్, బెయిర్‌స్టో 121 పరుగులు జోడించారు. అయితే మరో ఎండ్‌లో రూట్‌ తన జోరు కొనసాగించాడు. బుమ్రా బౌలింగ్‌లో సింగిల్‌ తీసిన రూట్‌ 200 బంతుల్లో తన కెరీర్‌లో 22వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

అనంతరం టెస్టుల్లో 9 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. రూట్‌కు ఆ తర్వాత బట్లర్‌ (23), మొయిన్‌ అలీ (27) కొద్ది సేపు సహకరించారు. వీరిద్దరితో రూట్‌ రెండు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే ఇషాంత్‌ ఒక్కసారిగా చెలరేగడంతో ఇంగ్లండ్‌ పరిస్థితి మారిపోయింది. ముందుగా బట్లర్‌ను అవుట్‌ చేసిన ఇషాంత్‌... కొద్ది సేపటి తర్వాత వరుస బంతుల్లో అలీ, స్యామ్‌ కరన్‌ (0)లను పెవిలియన్‌ పంపించాడు. ఈ దశలో భారత్‌కంటే ఇంగ్లండ్‌ మరో 23 పరుగులు వెనుకబడి ఉంది. అయితే బాధ్యత తీసుకున్న రూట్‌... జట్టుకు ఆధిక్యం అందించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. చివరి సెషన్‌లో భారత బౌలింగ్‌ జోరుకు 77 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్‌ 5 వికెట్లు కోల్పోయింది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 364;
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (ఎల్బీ) (బి) షమీ 49; సిబ్లీ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 11; హసీబ్‌ (బి) సిరాజ్‌ 0; రూట్‌ (నాటౌట్‌) 180; బెయిర్‌స్టో (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 57; బట్లర్‌ (బి) ఇషాంత్‌ 23; అలీ (సి) కోహ్లి (బి) ఇషాంత్‌ 27; స్యామ్‌ కరన్‌ (సి) రోహిత్‌ (బి) ఇషాంత్‌ 0; రాబిన్సన్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 6; వుడ్‌ (రనౌట్‌) 5; అండర్సన్‌ (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 33; మొత్తం (128 ఓవర్లలో ఆలౌట్‌) 391.
వికెట్ల పతనం: 1–23, 2–23, 3–108, 4–229, 5–283, 6–341, 7–341, 8–357, 9–371, 10–391.
బౌలింగ్‌: ఇషాంత్‌ 24–4–69–3, బుమ్రా 26–6–79–0, షమీ 26–3–95–2, సిరాజ్‌ 30–7–94–4, జడేజా 22–1–43–0.

మరిన్ని వార్తలు