తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి షాక్‌..

1 Jun, 2021 18:37 IST|Sakshi

లండన్: న్యూజిలాండ్‌తో రేపటి నుంచి (జూన్‌ 2) ప్రారంభంకానున్న తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లాండ్‌కు గట్టి షాక్ తగిలింది. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా ఆ జట్టు సారధి జో రూట్‌   గాయపడ్డాడు. బ్యాటింగ్‌ సాధన చేసేటప్పుడు అతని చేతికి గాయంకావడంతో వెంటనే అతను నెట్స్ నుంచి వెళ్లిపోయాడు. నెట్స్‌లో డాగ్ థ్రోయర్ ద్వారా కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ సంధించిన బంతి నేరుగా కుడి చేతిని తాకడంతో రూట్‌ కొద్దిసేపు బాధతో విలవిలలాడిపోయాడు. అసిస్టెంట్ కోచ్ పాల్ కొలింగ్‌వుడ్ సహకారంతో అతను గ్రౌండ్‌ను వీడాడు.  మరి కొద్దిగంటల్లో న్యూజిలాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాల్సిన పరిస్థితుల్లో అతను గాయపడటం ఇంగ్లండ్ జట్టును కలవరపెడుతుంది. 

ఇప్పటికే కీలక ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్, జేసన్ రాయ్ జట్టుకు దూరం కాగా, తాజాగా కెప్టెన్‌ రూట్‌ కూడా గాయం బారిన పడటంతో ఇంగ్లీష్‌ జట్టులో ఆందోళన మొదలైంది. గత కొద్దికాలంగా సూపర్‌ ఫామ్‌లో ఉన్న రూట్‌ ఇంగ్లండ్‌ విజయావకాశాలను కచ్చితంగా ప్రభావితం చేయగలడని అభిమానులు ఆశలు పెంచుకున్నారు. అయితే గాయం కారణంగా అతను మ్యాచ్‌కు దూరమైతే తమ జట్టు ఓటమి పాలవుతుందని ఇంగ్లండ్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ మ్యాచ్‌కు రూట్‌ అందుబాటులో ఉండకపోతే అతని స్థానాన్ని సామ్‌ బిల్లింగ్స్‌ భర్తీ చేస్తాడని జట్టు యాజమాన్యం సూచన ప్రాయంగా తెలిపింది.
చదవండి: త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న పాక్‌ కెప్టెన్‌

>
మరిన్ని వార్తలు