ICC Test Rankings: టాప్‌కు చేరిన రూట్‌.. పదో స్థానానికి పడిపోయిన కోహ్లి

15 Jun, 2022 16:59 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ సత్తా చాటాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రూట్‌ టెస్ట్‌ల్లో మరోసారి  టాప్‌ ప్లేస్‌కు ఎగబాకాడు. కివీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన శతకంతో (115) పాటు రెండో టెస్ట్‌లో భారీ శతకాన్ని (176) నమోదు చేసిన రూట్‌ మొత్తం 897 రేటింగ్‌ పాయింట్లు సాధించి ఆసీస్‌ ఆటగాడు లబూషేన్‌ (892)ను వెనక్కునెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు.

ఈ జాబితాలో ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌ (845) మూడో స్థానంలో, పాక్‌ స్కిప్పర్‌ బాబర్‌ ఆజమ్‌ (815) నాలుగో ప్లేస్‌లో, న్యూజిలాండ్‌ సారధి కేన్‌ విలియమ్సన్‌ (798) ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (754), మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (742) వరుసగా 8, 10 స్థానాలకు దిగజారారు. తాజా ర్యాంకింగ్స్‌లో రూట్‌ తిరిగి అగ్రస్థానానికి చేరుకోవడంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ సందర్భంగా ఐసీసీ రూట్‌ను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఏడాదిన్నర కాలంలో టెస్ట్‌ల్లో 10 సెంచరీలు చేసిన రూట్‌.. ప్రస్తుత తరంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో తిరుగులేని ఆటగాడని కొనియాడింది. ఇక బౌలర్ల జాబితాలో ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌  కమిన్స్‌ (901), టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌లు తొలి రెండు స్థానాలను పదిలంగా కాపాడుకోగా.. భారత పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా, పాక్‌ స్పీడ్‌గన్‌ షాహీన్‌ అఫ్రిది 3, 4 స్థానాలకు ఎగబాకారు.
చదవండి: Ishan Kishan: టాప్‌-10లోకి తొలిసారి .. ఒకేసారి 68 స్థానాలు ఎగబాకి

మరిన్ని వార్తలు