మ్యాచ్‌ చేజారిపోతోంది..టీమిండియా పోరాటం ఎంతవరకూ!

27 Aug, 2021 05:45 IST|Sakshi

రూట్‌ ‘హ్యాట్రిక్‌’ సెంచరీ  

రాణించిన మలాన్‌ 

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 423/8

హెడింగ్లీ టెస్టుపై ఇంగ్లండ్‌ పట్టు బిగించింది... తొలి రోజు తమ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బ తీసిన ఆతిథ్య జట్టు రెండో రోజు బ్యాటింగ్‌ జోరును చూపించింది. ఓపెనర్లు వేసిన బలమైన పునాదిపై వరుసగా మూడో టెస్టులోనూ సారథి రూట్‌ శతకంతో భారీ స్కోరుకు బాట వేశాడు. దాంతో ఇప్పటికే ఇంగ్లండ్‌ 345 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి స్థితిలో భారత్‌ ఎదురీది ఎంత వరకు ఈ మ్యాచ్‌లో పోరాడగలదో చూడాలి.  

లీడ్స్‌: రెండో రోజూ ఇంగ్లండ్‌దే! వాళ్ల ఆటతీరు బంతి నుంచి బ్యాట్‌కు బదిలీ అయింది తప్ప ఆడిన తీరు, క్రీజులో జోరు ఏమాత్రం తగ్గలేదు. పరుగుల హోరు ఆగలేదు. బ్యాటింగ్‌ వరుసలో టాపార్డర్‌ ‘టాప్‌’ ప్రదర్శన చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ (165 బంతుల్లో 121; 14 ఫోర్లు) మరో శతకంతో చెలరేగగా,  డేవిడ్‌ మలాన్‌ (128 బంతుల్లో 70; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 129 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ప్రస్తుతం 345 పరుగుల ఆధిక్యంలో నిలవగా, ఓవర్టన్‌ (24 బ్యాటింగ్‌), రాబిన్సన్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా, సిరాజ్‌ చెరో 2 వికెట్లు తీశారు.  

మలాన్‌ అర్ధసెంచరీ...
రెండో రోజు 120/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌...  కాసేపటికే ఓపెనర్‌ బర్న్స్‌ (61; 6 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ను కోల్పోయింది. దీంతో 135 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి షమీ తెరదించాడు. మరో ఓపెనర్‌ హమీద్‌కు డేవిడ్‌ మలాన్‌ జతయ్యాడు. మూడేళ్ల క్రితం (2018) భారత్‌తోనే తన చివరి టెస్టు ఆడిన మలాన్‌ మళ్లీ ఇప్పుడు అదే ప్రత్యర్థిపై పునరాగమనం చేశాడు. టి20 నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ అయిన మలాన్‌ కాస్త వేగంగా ఆడగా... హమీద్‌ (195 బంతుల్లో 68; 12 ఫోర్లు)మాత్రం టెస్టుకు తగిన ఇన్నింగ్సే ఆడాడు. అయితే అతన్ని జడేజా బౌల్ట్‌ చేయడంతో 159 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రెండు టెస్టులాడినా ఒక్క వికెట్‌ కూడా తీయని జడేజాకు ఈ సిరీస్‌లో దక్కిన తొలి వికెట్‌ ఇదే! అనంతరం సూపర్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ రూట్, మలాన్‌కు జతయ్యాడు.  

ముచ్చటగా మూడో శతకం...
స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్‌ జాగ్రత్త పడింది. మరో అవకాశమివ్వకుండా రూట్, మలాన్‌ సమన్వయంతో ఆడారు. 182/2 స్కోరు వద్ద లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు. రెండో సెషన్‌లో రూట్‌ వన్డే ఆట ఆడేశాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 71వ ఓవర్లో రెండు వరుస బౌండరీలు బాదిన రూట్‌ పేసర్లు ఇషాంత్, షమీల బౌలింగ్‌లోనూ యథేచ్చగా ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే ముందుగా వచ్చిన మలాన్‌ కంటే 57 బంతుల్లోనే (7 ఫోర్లు) రూట్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 250 పరుగులు దాటింది. ఆపై మలాన్‌ కూడా 99 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు.

టీ విరామానికి ముందు మలాన్‌ను సిరాజ్‌ అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆఖరి సెషన్లో 5 ఇంగ్లండ్‌ వికెట్లు కూలినా అప్పటికే భారత్‌కు జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. ఇంగ్లండ్‌కు ఆధిక్యం అమాంతం పెరిగింది. బెయిర్‌ స్టో అండతో రూట్‌ సెంచరీ 124 బంతుల్లో సెంచరీ (12 ఫోర్లు) సాధించాడు. షమీ స్వల్ప వ్యవధిలో బెయిర్‌ స్టో (29), బట్లర్‌ (7) వికెట్లను పడేశాడు. తర్వాత రూట్‌ను బుమ్రా బౌల్డ్‌ చేశాక... టెయిలెండర్లు  ఓవర్టన్, స్యామ్‌ కరన్‌ (15) జట్టు స్కోరును 400పైచిలుకు తీసుకెళ్లారు.  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 78
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (బి) షమీ 61; హమీద్‌ (బి) జడేజా 68; మలాన్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 70; రూట్‌ (బి) బుమ్రా 121; బెయిర్‌స్టో (సి) కోహ్లి (బి) షమీ 29; బట్లర్‌ (సి) ఇషాంత్‌ (బి) షమీ 7; మొయిన్‌ అలీ (సి) (సబ్‌) అక్షర్‌ (బి) జడేజా 8; స్యామ్‌ కరన్‌ (సి) (సబ్‌) మయాంక్‌ (బి) సిరాజ్‌ 15; ఓవర్టన్‌ బ్యాటింగ్‌ 24; రాబిన్సన్‌ బ్యాటింగ్‌ 0; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (129 ఓవర్లలో 8 వికెట్లకు) 423.
వికెట్ల పతనం: 1–135, 2–159, 3–298, 4–350, 5–360, 6–383, 7–383, 8–418.
బౌలింగ్‌: ఇషాంత్‌ 22–0–92–0, బుమ్రా 27–10–58–1, షమీ 26–7–87–3, సిరాజ్‌ 23–3–86–2, జడేజా 31–7–88–2.  

2021లో రూట్‌ జోరు
అత్యద్భుత ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌  
కెప్టెన్‌ జో రూట్‌ రికార్డులను తిరగరాస్తున్నాడు. 2021లో ఇప్పటి వరకు 11 టెస్టుల్లో 21 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను 69.90 సగటుతో 1398 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. భారత్‌పైనే 875 పరుగులు చేయగా 4 సెంచరీలు సాధించాడు. ఇదే జోరును అతను కొనసాగిస్తే ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగుల మొహమ్మద్‌ యూసుఫ్‌ (1788) రికార్డును అతను అధిగమించవచ్చు. ప్రస్తుత
సిరీస్‌తో పాటు ఈ ఏడాది ‘యాషెస్‌’తో కలిపి రూట్‌ కనీసం మరో ఐదు టెస్టులు ఆడే అవకాశం ఉంది. అతను మరో 391 పరుగులు చేస్తే చాలు.   
 

మరిన్ని వార్తలు