Joe Root: విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్‌ ముద్ర చెరిపేయాల్సిందే

23 Jan, 2023 07:54 IST|Sakshi

ఇంగ్లండ్‌ ఆటగాడు జోరూట్‌ అనగానే టెస్టు స్పెషలిస్ట్‌ అనే ట్యాగ్‌ గుర్తొస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చూసుకుంటే వన్డేలు మాత్రమే ఆడే రూట్‌ టి20లు చాలా తక్కువగా ఆడాడు. ఇక టెస్టుల్లో తన ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ఎన్నో విజయాలు అందించాడు. టెస్టు స్పెషలిస్ట్‌ అనే ముద్ర ఉండడంతో ఐపీఎల్‌, బీబీఎల్‌ లాంటి లీగ్స్‌లో రూట్‌ పేరు పెద్దగా కనిపించదు. ఒకవేళ​ వేలంలో పాల్గొన్నా అతన్ని కొనడానికి ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపేది కాదు.

అయితే రూట్‌కున్న టెస్టు స్పెషలిస్ట్‌ అనే ట్యాగ్‌ చెరిపేయాల్సిన సమయం వచ్చినట్లుంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20లో రూట్‌ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌ అందుకు కారణమయింది. ఆదివారం రాత్రి దుబాయ్‌ క్యాపిటల్స్‌, ముంబై ఎమిరేట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన దుబాయ్‌ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 222 పరుగులు చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రోవ్‌మెన్‌ పావెల్‌ (41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. జో రూట్‌ (54 బంతుల్లో 82, 8 ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. తన శైలికి విరుద్ధంగా ఆడిన రూట్‌ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 

అనంతరం బ్యాటింగ్‌ చేసిన ముంబై ఎమిరేట్స్‌ కూడా ధీటుగానే బదులిచ్చింది. అయితే చివర్లో ఒత్తిడికి తలొగ్గిన ముంబై ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కీరన్‌ పొలార్డ్‌(38 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.

చదవండి: ఫించ్‌ 'దంచి కొట్టుడు'.. 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో..!

మరిన్ని వార్తలు