Jofra Archar: రెండేళ్ల తర్వాత పునరాగమనం.. వన్డే కెరీర్‌లో చెత్త రికార్డు

28 Jan, 2023 10:44 IST|Sakshi

ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ దాదాపు రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులో పునరాగమనం చేశాడు. అయితే రీఎంట్రీలో ఆర్చర్‌ నాసిరకం బౌలింగ్‌ ప్రదర్శించాడు. 10 ఓవర్లు వేసిన ఆర్చర్‌ 81 పరుగులు సమర్పించుకొని కేవలం ఒకే ఒక్క వికెట్‌ పడగొట్టాడు. ఆర్చర్‌ వన్డే కెరీర్‌లోనే ఇవి అత్యంత చెత్త గణాంకాలుగా నమోదయ్యాయి.

678 రోజుల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఆర్చర్‌ ఒక ఓవర్లో 20 పరుగులకు పైగా సమర్పించుకున్నాడు. ఒక వన్డే మ్యాచ్‌లో ఆర్చర్‌ ఒక ఓవర్‌లో ఇన్ని పరుగులు ఇచ్చుకోవడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే లాంగ్‌ గ్యాప్‌ తర్వాత క్రికెట్‌ ఆడడంతో ఆర్చర్‌ బౌలింగ్‌ లైనప్‌ కాస్త గాడిన పడాల్సి ఉంది. అయితే వేన్‌ పార్నెల్‌ రూపంలో ఒక వికెట్‌ తీయడం ఆర్చర్‌కు కాస్త ఊరట అని చెప్పొచ్చు.

ఇక 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ జట్టుకు ఆర్చర్‌ కీలక బౌలర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అప్పటిలోగా మునుపటి ఫామ్‌ అందుకుంటాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో జరగనున్న మెగా టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. సొంతగడ్డపై వన్డే సిరీస్‌ ఆడుతున్న ఇంగ్లండ్‌కు సౌతాఫ్రికా షాక్‌ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. వాండర్‌ డుసెన్‌ (117 బంతుల్లో 111 పరుగులు, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌) సెంచరీతో మెరవగా.. డేవిడ్‌ మిల్లర్‌ 53 పరుగులతో రాణించాడు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 44.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(91 బంతుల్లో 113 పరుగులు, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు సెంచరీ వృథాగా మారింది. డేవిడ్‌ మలన్‌(59 పరుగులు)మినహా మిగతావారు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేకపోయారు. ప్రొటిస్‌ బౌలర్లలో అన్‌రిచ్‌ నోర్ట్జే నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిసందా మగల మూడు, కగిసో రబడా రెండు, తబ్రెయిజ్‌ షంసీ ఒక వికెట్‌ తీశాడు. 

చదవండి: ఏ మాత్రం తగ్గని ధోని ​మేనియా

'గడిచిన 18 నెలలు కష్టకాలంగా అనిపించింది'

మరిన్ని వార్తలు