'బయోబబుల్ నరకం.. కౌంట్‌డౌన్ మొదలెట్టా'

29 Oct, 2020 16:59 IST|Sakshi

దుబాయ్‌ : ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ తరపున 12 మ్యాచ్‌లాడిన  ఆర్చర్‌ 17 వికెట్లతో స్థిరంగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ 13వ సీజన్‌ బయోసెక్యూర్‌ బబుల్‌ వాతావరణంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. లీగ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లంతా బయోసెక్యూర్‌లోనే గడపాల్సి ఉంటుంది. తాజాగా బయోసెక్యూర్‌ బబుల్‌ నుంచి బయటపడేందుకు తాను కౌంట్‌డౌన్‌ మొదలెట్టినట్లు ఆర్చర్‌ పేర్కొన్నాడు. బ్రిటీష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పాల్గొన్న ఆర్చర్‌ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. (చదవండి : సూర్య అద్భుతం.. కానీ నిరాశలో ఉన్నాడు)

'నేను ఫ్రీ అయ్యేందుకు కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టా. గత కొన్ని నెలలుగా బయో సెక్యూర్‌ బబుల్‌ అనే నరకంలో ఉంటున్నాని.. త్వరలోనే అందులోంచి బయటపడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఒక ఏడాది క్యాలెండర్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడే నేను ఈ ఏడాది మాత్రం రోజుల ఎంత త్వరగా గడుస్తాయా అని ఆలోచిస్తున్నా. ఏవైనా సిరీస్‌లు ఆడేటప్పుడు బయోసెక్యూర్‌ బబుల్‌తో కేవలం హోటల్‌, మైదానానికి పరిమితం కావాల్సి వస్తుంది. ఖాళీ స్టేడియాల్లో ఆడడం అనేది నాకు ఏదోలా అనిపిస్తుంది. నాకు తెలిసినంతవరకు బయోబబుల్‌లో అందరికన్నా ఎక్కువగా గడిపింది నేనే అనుకుంటున్నా. కరోనా వల్ల బయోబబుల్‌లో ఉంటున్నా తనకు ఫ్యామిలీ వెంట ఉన్నా.. స్వేచ్చ అనేది మాత్రం దూరమైపోయింది. కొద్ది రోజుల్లో ఐపీఎల్‌ ముగిసిపోతుందిగా.. అందుకే కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టా 'అని తెలిపాడు.

వాస్తవానికి ఐపీఎల్‌ ప్రారంభం కాకముందు ఇంగ్లండ్‌ టీమ్‌ వెస్టిండీస్‌తో సిరీస్‌ ఆడిన విషయం విధితమే. ఆ సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్‌ కూడా పాల్గొన్నాడు. విండీస్‌తో జరిగిన సిరీస్‌ కూడా బయోసెక్యూర్‌ బబుల్‌ వాతావరణంలోనే జరిగింది. అప్పటినుంచి ఆర్చర్‌ బయోబబుల్‌ సెక్యూర్‌లో గడిపాడు. అయితే బయో బబుల్‌ నిబంధనలు ఉల్లఘించినందుకు ఆర్చర్‌పై రెండో టెస్టులో వేటు కూడా పడింది. ఆ తర్వాత ఐపీఎల్‌లో ఆడేందుకు వచ్చిన ఆర్చర్‌ అదే వాతావరణంలో ఉండడంతో అసహనం వ్యక్తం చేశాడు. ఇక లీగ్‌లో రాజస్తాన్‌ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన రాజస్తాన్‌ 5 విజయాలు, ఏడు ఓటములతో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరడం కొంచెం కష్టమే అయినా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవడంతో పాటు రన్‌రేట్‌ను కూడా గణనీయంగా మెరుగుపరుచుకోవాలి. అంతేకాదు తనకంటే ముందున్న ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌, పంజాబ్‌లు మిగిలిన మ్యాచ్‌లు ఓడిపోతేనే రాజస్తాన్‌కు ప్లేఆఫ్‌ చేరే అవకాశం ఉంటుంది. కాగా రాజస్తాన్‌ తన తర్వాతి మ్యాచ్‌లో శుక్రవారం కింగ్స్‌ పంజాబ్‌తో తలపడనుంది. (చదవండి : పాండ్యా, క్రిస్‌ మోరిస్‌ మాటల యుద్ధం)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు