మొన్న బనానా ఇన్‌స్వింగర్‌; నేడు స్నార్టర్‌.. నువ్వు సూపర్‌

13 May, 2021 19:31 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ తన పునరాగమనాన్ని బలంగా చాటుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి గాయాలతో సతమతమవుతూ వచ్చిన ఆర్చర్‌ టీమిండియాతో జరిగిన సిరీస్‌లో మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. తాజాగా గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్‌  కౌంటీ క్రికెట్‌ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ససెక్స్‌ తరపున ఆడుతున్న ఆర్చర్‌ తన వికెట్ల వేటను కొనసాగిస్తున్నాడు.

మొన్న సర్రీతో జరిగిన మ్యాచ్‌లో బనానా ఇన్‌స్వింగర్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ ఔట్‌ చేసిన ఆర్చర్‌ మరో అద్బుత బంతితో మెరిశాడు. కెంట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  గురువారం ఆర్చర్‌ డేనియలల్‌ బెల్‌ రూపంలో తొలి వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత అతని నాలుగో ఓవర్‌లో జాక్‌ క్రాలీని బుట్టలో వేసుకున్నాడు. 143 కిమీ వేగంతో  ఆర్చర్‌ విసిరిన ఆ బంతి క్రాలీ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకుతూ  వికెట్‌ కీపర్‌ చేతుల్లో పడింది. దీనికి సంబంధించిన వీడియోను ససెక్స్‌ క్రికెట్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ''ఆర్చర్‌ ఆన్‌ ఫైర్‌.. ధట్స్‌ ఏ స్నార్టర్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఆర్చర్‌ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

కాగా ఆర్చర్‌ త్వరలోనే ఇంగ్లండ్‌ జట్టుతో కలవనున్నాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌తో పాటు టీమిండియాతో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లోనూ ఆర్చర్‌ అడే అవకాశం ఉంది. అంతేగాక రానున్న టీ20  ప్రపంచకప్‌లో ఆర్చర్‌ ఇంగ్లండ్‌ బౌలింగ్‌ విభాగంలో కీలకం కానున్నాడు.
చదవండి: ఆర్చర్‌ బనానా ఇన్‌స్వింగర్‌.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్‌

మరిన్ని వార్తలు