లానింగ్, జొనసెన్‌ చెలరేగగా... 

8 Mar, 2023 01:45 IST|Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

42 పరుగులతో యూపీ ఓటమి

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్‌ మరోసారి భారీ స్కోరుతో విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై జయభేరి మోగించింది. ముందుగా క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల స్కోరు చేసింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (42 బంతుల్లో 70; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జెస్‌ జొనసెన్‌ (20 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూపీ వారియర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. సహచరులు తడబడినా... తాహ్లియా మెక్‌గ్రాత్‌ (50 బంతుల్లో 90 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అసాధారణ పోరాటం చేసి అజేయంగా నిలిచింది. 

లానింగ్‌ అర్ధ సెంచరీ 
తొలి రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు లానింగ్, షఫాలీ ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. షబ్నిమ్‌ ఐదో ఓవర్లో లానింగ్‌ ఒక సిక్స్, రెండు బౌండరీలతో 16 పరుగులు పిండుకుంది. రాజేశ్వరి వేసిన ఆరో ఓవర్లో షఫాలీ ఫోర్‌ కొడితే లానింగ్‌ మూడు బౌండరీలతో రెచ్చిపోయింది. పవర్‌ ప్లేలో ఢిల్లీ స్కోరు 62/0. మరుసటి ఓవర్లోనే షఫాలీ (17; 1 ఫోర్, 1 సిక్స్‌) ఆటను తాహ్లియా ముగించగా, మెగ్‌ లానింగ్‌ మాత్రం తన ధాటిని కొనసాగించి 32 బంతుల్లో (7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించింది.

తర్వాత కాసేపు వాన ఆటంకపరిచింది. ఆట తిరిగి మొదలయ్యాక 11వ ఓవర్లో ఢిల్లీ స్కోరు 100 దాటింది. స్వల్ప వ్యవధిలో మరిజన్‌ (16; 2 ఫోర్లు), లానింగ్‌ నిష్క్రమించారు. తర్వాత వచ్చిన జెమిమా (22 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు), క్యాప్సీ (10 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఢిల్లీ వేగాన్ని కొనసాగించారు. ఆఖర్లో జొనసెన్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. దీంతో ఆఖరి 4 ఓవర్లలో ఢిల్లీ 58 పరుగులు సాధించడంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 200 మార్క్‌ దాటింది.  

మెక్‌గ్రాత్‌ ఒంటరి పోరాటం 
కొండంత లక్ష్యం ముందుంటే యూపీ వారియర్స్‌ టాపార్డర్‌ నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకుంది.  కెప్టెన్‌ అలీసా హీలీ (17 బంతుల్లో 24; 5 ఫోర్లు),  శ్వేత (1), కిరణ్‌ నవ్‌గిరే (2) ‘పవర్‌ ప్లే’లోనే  పెవిలియన్‌కెళ్లారు. తర్వాత వచ్చిన వారిలో తాహ్లియా  ఒంటరిపోరాటం చేసింది.

దీప్తి శర్మ (12), దేవిక వైద్య (21 బంతుల్లో 23; 2 ఫోర్లు)లు దూకుడుగా  ఆడబోయి వెనుదిరిగారు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన జొనసెన్‌ స్పిన్‌ బౌలింగ్‌తో యూపీని చావుదెబ్బ తీసింది.  మెక్‌గ్రాత్‌ 36 బంతుల్లో  ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మెక్‌గ్రాత్‌... ఆఖరి ఓవర్లలో ఆమె ఫోర్లు, సిక్సర్లు బాదడంతో యూపీ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది.   

స్కోరు వివరాలు 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: మెగ్‌ లానింగ్‌ (బి) రాజేశ్వరి 70; షఫాలీ (సి) నవ్‌గిరే (బి) తాహ్లియా 17; మరిజన్‌ (సి) దీప్తిశర్మ (బి) ఎకిల్‌స్టోన్‌ 16; జెమిమా నాటౌట్‌ 34; క్యాప్సీ (సి) 
ఎకిల్‌స్టోన్‌ (బి) షబ్నిమ్‌ 21; జొనసెన్‌ నాటౌట్‌ 42; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం  (20 ఓవర్లలో 4 వికెట్లకు) 211.  వికెట్ల పతనం: 1–67, 2–96, 3–112, 4–144. 
బౌలింగ్‌: షబ్నమ్‌ 4–0–29–1, అంజలీ 3–0–31–0, రాజేశ్వరి గైక్వాడ్‌ 2–0–31–1, తాహ్లియా మెక్‌గ్రాత్‌ 3–0–37–1, దీప్తిశర్మ 4–0–40–0, సోఫీ ఎకిల్‌స్టోన్‌ 4–0–41–1. 

యూపీ వారియర్స్‌ ఇన్నింగ్స్‌: హీలీ (సి) జెమిమా (బి) జొనసెన్‌ 24; శ్వేత (సి) తానియా (బి) మరిజన్‌ 1; కిరణ్‌ నవ్‌గిరే (సి) క్యాప్సీ (బి) జొనసెన్‌ 0; తాహ్లియా మెక్‌గ్రాత్‌ నాటౌట్‌ 90; దీప్తిశర్మ (సి) రాధ (బి) శిఖా 12; దేవిక (సి) రాధ (బి) జొనసెన్‌ 23; సిమ్రన్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5  వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–29, 2–31, 3–31, 4–71, 5–120. 
బౌలింగ్‌: మరిజన్‌ 4–1–29–1, శిఖాపాండే 4–0–18–1, జెస్‌ జొనసెన్‌ 4–0–43–3, నోరిస్‌ 2–0–25–0, క్యాప్సీ 4–0–25–0, రాధ 1–0–11–0, అరుంధతి 1–0–14–0.   


డబ్ల్యూపీఎల్‌లో నేడు
గుజరాత్‌ జెయింట్స్‌ Vs బెంగళూరు 
రాత్రి గం. 7:30 నుంచి  స్పోర్ట్స్‌ 18 చానెల్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 
 

>
మరిన్ని వార్తలు