Jonny Bairstow: టెస్ట్‌ సిరీస్‌ కోసం కీలక లీగ్‌ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌

3 Aug, 2022 16:31 IST|Sakshi

డబ్బులొచ్చే టోర్నీల కన్నా దేశం కోసం ఆడటమే ముఖ్యమని నిరూపించాడు ఇంగ్లండ్‌ విధ్వంసకర వీరుడు జానీ బెయిర్‌స్టో. ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్న బెయిర్‌స్టో.. త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌ కోసం స్వదేశంలో జరిగే 'హండ్రెడ్‌ లీగ్‌'లో ఆడే అవకాశాన్ని వదులుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీ షెడ్యూల్‌ కారణంగా అలసిపోయానని, మున్ముందు కూడా చాలా హెవీ షెడ్యూల్‌ ఉన్నందున రెస్ట్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని, అందుకే హండ్రెడ్‌ లీగ్‌కి దూరంగా ఉం‍డాలని అనుకుంటున్నానని బెయిర్‌స్టో వెల్లడించాడు. 

బెయిర్‌స్టో.. ఇవాల్టి (ఆగస్ట్‌ 3) నుంచి ప్రారంభం కానున్న హండ్రెడ్ లీగ్‌ రెండో ఎడిషన్‌లో కార్డిఫ్‌ ఫ్రాంచైజీ అయిన వెల్ష్ ఫైర్‌కు ఆడాల్సి ఉండింది. వెల్ష్ ఫైర్‌ ఇవాల్టి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సౌత్‌ బ్రేవ్‌ను ఢీకొట్టాల్సి ఉంది. హండ్రెడ్‌ లీగ్‌లో మొత్తం ఎనిమిది జట్లు (ట్రెంట్ రాకెట్స్, నార్తర్న్ సూపర్‌చార్జర్స్, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, సౌత్‌ బ్రేవ్, వెల్ష్ ఫైర్, ఓవల్ ఇన్విన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్, లండన్ స్పిరిట్) ఒకదానితో ఒకటి తలపడతాయి. ఒక్కో ఇన్నింగ్స్‌లో 100 బాల్స్ చొప్పున సాగే ఈ టోర్నీ.. టీ20 తరహాలో ప్రజాధరణ పొందలేకపోయింది. 

ఇదిలా ఉంటే, ఆగస్ట్‌ 17 నుంచి దక్షిణాఫ్రికాతో  జరుగనున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌ కోసం (తొలి రెండు టెస్ట్‌లకు) ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు నిన్న (ఆగస్ట్‌ 2) జట్టును ప్రకటించింది. 14 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో బెయిర్‌స్టో సహా బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, బెన్ ఫోక్స్ (వికెట్‌ కీపర్‌), జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్‌టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్ ఉన్నారు. 
చదవండి: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌!

మరిన్ని వార్తలు