ఆ క్రికెటర్‌ రెండో టెస్టులో ఆడనున్నాడు

29 Jan, 2021 19:22 IST|Sakshi

సాక్షి, లండన్‌: భారత్‌తో జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ జానీ బెయిర్‌ స్టో రెండో టెస్ట్‌ నుంచి అందుబాటులో ఉంటాడని ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాహం థోర్‌‍్ప ప్రకటించాడు. తొలుత బెయిర్‌స్టోకు తొలి రెండు టెస్ట్‌లకు విశ్రాంతి కల్పించాలని భావించిన ఆ జట్టు మేనేజ్‌మెంట్‌.. అనూహ్యంగా అతను రెండో టెస్ట్‌కు జట్టుతో కలుస్తాడని ప్రకటించింది. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్ట్‌ సిరీస్‌లో కెప్టెన్‌ జో రూట్‌ తరువాత అత్యధిక పరుగులు చేసిన బెయిర్‌స్టోను తొలి రెండు టెస్ట్‌లకు విశ్రాంతి కల్పించడంపై విమర్శలు రావడంతో మేనేజ్‌మెంట్‌ అతన్ని రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-0 తేడాతో చేజిక్కించుకోగా, అందులో బెయిర్‌స్టో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 46.33 సగటుతో 139 పరుగులు సాధించాడు. 

కాగా, భారత్‌తో జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌కు ముందు రోటేషన్‌ పద్ధతి కారణంగా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మార్క్‌ వుడ్‌, సామ్‌ కర్రన్‌, బెయిర్‌స్టోలకు ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ విశ్రాంతి కల్పించింది. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగబోయే నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా ప్రారంభం కానుండగా, రెండో టెస్ట్‌ ఇదే వేదికగా ఫిబ్రవరి 13న, ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌ వేదికగా మూడో టెస్ట్‌, ఇదే వేదికలో మార్చి 4న నాలుగో టెస్ట్‌ ప్రారంభంకానున్నాయి. ఇంగ్లండ్‌ జట్టు సుదీర్ఘ భారత పర్యటనలో 4 టెస్ట్‌లు, 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. 
 

మరిన్ని వార్తలు