T20 WC 2022: మొయిన్‌ అలీ, రషీద్‌ విషయంలో బట్లర్‌ పెద్ద మనసు

14 Nov, 2022 11:24 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌ 2022లో ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి రెండోసారి వరల్డ్‌కప్‌ను అందుకున్నారు. బెన్‌ స్టోక్స్‌ విజయంలో కీలకపాత్రో పోషించగా.. ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి విజయంలో భాగమయ్యాడు. 2010లో టైటిల్‌ నిలిచిన ఇంగ్లండ్‌ మళ్లీ పుష్కరకాలం తర్వాత పొట్టి ఫార్మట్‌లో చాంపియన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో వారి సెలబ్రేషన్స్‌కు అవదులు లేకుండా పోయాయి. 

ఇక సెలబ్రేషన్స్‌ సమయంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌ పెద్ద మనసు చాటుకున్నాడు. సాధారణంగా ఒక జట్టు ఎలాంటి మేజర్‌ టోర్నీలు నెగ్గినా షాంపెన్‌తో సెలబ్రేషన్‌ చేయడం చూస్తుంటాం. టైటిల్‌ అందుకున్న తర్వాత బట్లర్‌ తన జట్టుతో గ్రూప్‌ ఫోటో దిగాడు. ఆ తర్వాత షాంపెన్‌ సెలబ్రేషన్‌ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వెంటనే బట్లర్‌ రషీద్‌, మొయిన్‌ అలీని పిలిచి షాంపెన్‌ సెలబ్రేషన్‌ చేస్తున్నాం.. పక్కకు వెళ్లండి అని పేర్కొన్నాడు. అర్థం చేసుకున్న ఈ ఇద్దరు బట్లర్‌కు థ్యాంక్స్‌ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌ ఆటగాళ్లు షాంపెన్‌ పొంగించి సంబరాలు చేసుకున్నారు. 

కాగా మద్యపానం ఇస్లాంకు విరుద్ధం. మద్యపానం నిషేధం మాత్రమే కాదు.. ఎక్కడ ఈవెంట్‌ జరిగినా అక్కడ ముస్లింలు మద్యపానం జోలికి కూడా వెళ్లరు. అందుకే బట్లర్‌ ఇస్లాం మతానికి విలువనిస్తూ ఆదిల్‌ రషీద్‌, మొయిన్‌ అలీలను పక్కకు వెళ్లమన్నాడు. వాళ్లు వెళ్లిన తర్వాతే షాంపెన్‌ సెలబ్రేషన్‌ చేయడం పట్ల బట్లర్‌కు ఇస్లాం మతంపై ఉన్న గౌరవం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా ..''బట్లర్‌ది నిజంగా పెద్ద మనసు.. మతాలకు చాలా విలువనిస్తాడు '' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: Ben Stokes: అప్పుడు విలన్‌.. ఇప్పుడు హీరో

మరిన్ని వార్తలు