కరన్‌లో ధోని లక్షణాలు చూశా: బట్లర్

29 Mar, 2021 11:38 IST|Sakshi

పుణే: ఆదివారం జరిగిన ఆఖరి మూడో మ్యాచ్‌లో భారత జట్టు వన్డే సిరీస్‌ను 2-1 తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో స్యామ్ కరన్ వీరోచిత ఇన్నింగ్స్‌ (95 నాటౌట్)‌ చూస్తే 'గ్రేట్ ఫినిషర్' మహేంద్ర సింగ్ ధోని లక్షణాలు కనిపించాయని బట్లర్‌ వ్యాఖ్యానించాడు. నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో, ఇంగ్లండ్‌ జట్టు 200 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో కరాన్ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి,  జట్టుని ముందుండి నడిపించడమే కాకుండా, మ్యాచ్‌లో చివరి వరకు పోరాడాడు. ఇటువంటి ప్రదర్శనలు మనం భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీలో చూస్తుంటామని ఈ సందర్భంగా బట్లర్‌ గుర్తు చేశాడు.

‘ప్రస్తుతం అందరి కళ్లు ఏప్రిల్ 9 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ పైన ఉంటాయి. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్న స్యామ్ ‌కరన్ నిన్న రాత్రి తను ఆడిన ఇన్నింగ్స్ గురించి చర్చిస్తాడని నేను అనుకుంటున్నాను. అంతరాతీయ క్రికెట్ ప్రపంచంలో అద్భుతమైన క్రికెటర్ గా, ఫినిషర్ గా ఎంఎస్ ధోని అంటే ఏమిటో మాకు తెలుసు. కనుక ధోనీ లాంటి గొప్ప ఆటగాడితో ఇలాంటివి పంచుకోవడం స్యామ్‌ కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐపీఎల్ కారణంగా మా ఆటగాళ్లకు కూడా ఎంఎస్‌ దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తుండడం నాకు ఆనందంగా ఉంది’అని మ్యాచ్ అనంతరం వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ బట్లర్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌ 2021లో చెన్నై జట్టు తరఫున ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ కూడా ఆడనున్నాడు.

భాగస్వామ్యాలు లేకే మ్యాచ్‌ను కోల్పోయాం
‘రెండో వన్డేలో 43.3 ఓవర్లలో 337 పరుగులు చేసిన ఇంగ్లండ్‌కు మూడో వన్డేలో 330 టార్గెట్  అంత కష్టమేమి కాదు, మేము ఆ స్కోరును చేధించగలమని అనుకున్నాం. రన్-రేట్ సమస్య అవుతుందని అనుకోలేదు, కాని మేము క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం, సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేక పోవడం వంటి అంశాలు ఇంగ్లండ్‌కు మ్యాచ్‌ను దూరం చేసింది.  

చిన్న, చిన్న పొరపాట్లు కలిసి పెద్దవిగా మారుతాయి. ఈ మ్యాచ్ లో అదే జరిగింది. మ్యాచ్‌ ఆరంభంలో మా బౌల్లర్లు క్రమశిక్షణగా బౌలింగ్‌ చేశారు,కానీ చివరి వరకు అది కొనసాగించలేదనే అనుకుంటున్నాను. భారత్‌ బ్యాట్స్‌మెన్‌లకు కొన్ని బౌండరీల విషయంలో కష్టపడకపోయినా సునాయాసంగా మేమే పరుగులు సమర్పించుకున్నాం. అవే మ్యాచ్‌లో 7 పరుగల తేడాతో ఓటమికి కారణమైంది’ అని బట్లర్‌ అన్నాడు.  
( చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న క్రికెటర్‌ ఇతనేనంటే నమ్ముతారా!‌ )

మరిన్ని వార్తలు