Jos Buttler Six Viral Video: దయ, జాలి లేకుండా..'అందుకే అనేది బట్లర్‌ మామూలోడూ కాదని'

23 Jun, 2022 10:49 IST|Sakshi

ఇంగ్లండ్‌ వన్డే వైస్‌ కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌ తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. బంతి దొరికిందే ఆలస్యం అన్నట్లుగా బట్లర్‌ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. డెడ్‌ బాల్‌, వైడ్‌ బాల్‌, నో బాల్‌ అనే లెక్క లేకుండా భీకరమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో దడ పుట్టిస్తు‍న్నాడు. మొన్నటివరకు ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున వరుస సెంచరీలతో హోరెత్తించి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్న బట్లర్‌ అదే టెంపోనూ కొనసాగిస్తు‍న్నాడు.

నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ 498 పరుగులు అత్యధిక వన్డే స్కోరును అందుకోవడంలో బట్లర్‌ పాత్ర కీలకం. 162 పరుగుల సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. తాజాగా మూడో వన్డేలో 86 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌తో మెరిసిన బట్లర్‌ జట్టుకు విజయాన్ని అందించి 3-0తో నెదర్లాండ్స్‌ క్లీన్‌స్వీప్‌ అయ్యేలా చేశాడు. 64 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 86 పరుగులు సాధించాడు. కాగా బుధవారం జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో బట్లర్‌ కొట్టిన ఒక సిక్స్‌ హైలైట్‌గా నిలిచింది. మాములుగానే అతను కొట్టే సిక్సర్లు  హైలైట్‌ అవుతాయి.. కానీ ఇది అంతకుమించి అనే చెప్పొచ్చు.

ఇన్నింగ్స్‌ 29వ ఓవర్‌ నెదర్లాండ్స్‌ బౌలర్‌ పాల్‌ వాన్‌ మీక్రిన్‌ వేశాడు. అప్పటికే బట్లర్‌ 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఓవర్‌ ఐదో బంతిని పాల్‌ వాన్‌ షార్ట్‌ పిచ్‌ వేసే ప్రయత్నంలో విఫలమయ్యాడు. బంతి స్లో అయ్యి క్రీజు పక్కకు పోయింది. బంతిని వదిలేద్దామన్న దయ, జాలీ ఏ కోశానా బట్లర్‌లో కనబడలేదు. ఎందుకు వదలడం అనుకున్నాడో కానీ.. రెండుసార్లు పిచ్‌పై పడిన బంతిని బట్లర్‌ క్రీజు నుంచి మొత్తం పక్కకు జరిగి భారీ సిక్సర్‌ కొట్టాడు. అంపైర్‌ డెడ్‌ బాల్‌గా పరిగణించడంతో పాటు నో బాల్‌ ఇచ్చి ఫ్రీ హిట్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.  ఆ తర్వాత ఫ్రీ హిట్‌ను కూడా బట్లర్‌ సిక్సర్‌గా మలవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. నెదర్లాండ్స్‌ విధించిన 245 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 30.1 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(86 బంతుల్లో 101 నాటౌట్‌, 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా.. బట్లర్‌ 86 నాటౌట్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకముందు నెదర్లాండ్స్‌ 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. సెంచరీతో మెరిసిన రాయ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు రాగా.. సిరీస్‌లో 248 పరుగులు చేసిన బట్లర్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కింది.

చదవండి: T20 Blast 2022: విజయానికి 9 పరుగులు.. కనివినీ ఎరుగని హైడ్రామా

కొడుకు బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయిన క్రికెటర్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు