Saha Vs Journalist: టీమిండియా వికెట్‌కీపర్‌పై పరువు నష్టం దావా కేసు..!

6 Mar, 2022 16:28 IST|Sakshi

ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్ట్ తనను బెదిరించాడంటూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాపై పరువు నష్టం దావా కేసు నమోదైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు జర్నలిస్ట్ సాహాపై పరువు నష్టం దావా వేశాడు. ఇంటర్వ్యూ కోసం సాహాతో చాట్ చేసింది వాస్తవమేనని, కానీ తన మెసేజ్‌లను సాహా టాంపర్ చేశాడని జర్నలిస్ట్ బోరియా మజుందార్ ప్రత్యారోపణలు చేశాడు. 


భారత టెస్ట్‌ జట్టులో చోటు దక్కదని తెలిసిన సాహా అభిమానుల సానుభూతి కోసమే తనపై ఆరోపణలు చేశాడని మజుందార్‌ పేర్కొన్నాడు. సాహా సోషల్ మీడియాలో షేర్‌ చేసిన చాట్స్ నకిలీవని, ఒరిజినల్‌ మెసేజ్‌లను కోర్టులో సమర్పిస్తానని తెలిపాడు. ఈ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు మజుందార్ ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేశాడు. కాగా, సాహా జర్నలిస్ట్‌పై చేసిన ఆరోపణలను బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణ కూడా చేపట్టింది. తొలుత జర్నలిస్ట్‌ పేరును వెల్లడించని సాహా విచారణలో భాగంగా సదరు జర్నలిస్ట్ పేరును కమిటీ ముందు వెల్లడించాడు. 

ఇదిలా ఉంటే, శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కకపోవడంతో సాహా.. హెడ్‌ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై కూడా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జట్టులో చోటుపై బీసీసీఐ బాస్‌ గంగూలీ తనకు భరోసా కల్పించినా, ద్రవిడ్‌ తనను రిటైర్మెంట్ గురించి ఆలోచించమన్నాడంటూ సాహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 
చదవండి: బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ

మరిన్ని వార్తలు