బరిలోకి వెళ్లేముందు ఎందుకు కొట్టాడో తెలుసా?

29 Jul, 2021 17:40 IST|Sakshi
మార్టినా ట్రాడోస్‌ను కొడుతున్న కోచ్‌ క్లాడియో పుస (ఫొటో: DNAIndia.com

టోక్యో: విశ్వ క్రీడా పోటీలు జపాన్‌ రాజధాని టోక్యోలో జరుగుతుండగా క్రీడాకారులు ప్రతిభ చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రీడా పోటీల్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ క్రీడాకారుడిని కోచ్‌ రెండు చెంపలు వాయించి పోటీలకు పంపించాడు. కోచ్‌ కొడుతుంటే ప్లేయర్‌ ఏమనకుండా ఓకే అంటూ బరిలోకి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అసలు కోచ్‌ ఎందుకు కొట్టారు? అనే సందేహం అందరిలో ఆసక్తి రేపుతోంది. మీరు చదివి తెలుసుకోండి.. ఎందుకో..

ఒలింపిక్స్‌లో జూడో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో జర్మనీకి చెందిన జూడో స్టార్‌ మార్టినా ట్రాడోస్‌ పాల్గొంది. రింగ్‌లోకి వెళ్లేముందు కోచ్‌ క్లాడియో పుస రెండు చేతులతో కాలర్‌ పట్టుకుని చెంపలపై వేగంగా కొట్టాడు. అక్కడున్న వారికి షాకింగ్‌ అనిపించింది. అయితే మార్టినా మాత్రం ఒకే అనుకుంటూ రింగ్‌లోకి వెళ్లింది. బరిలో దిగేముందు కోచ్‌ క్లాడియో ఇలా చేయడం ఆమెకు అలవాటు అని మార్టినా తెలిపింది. ప్రత్యర్థితో తలపడేలా ఉత్సాహంగా ఉండేందుకు ఇలా చేశారని పేర్కొంది. ఇది తనకు తప్పక అవసరమని చెప్పుకొచ్చింది. రెండు చెంపలు కొట్టడంతో నిద్రమబ్బు వదిలి బరిలో పతకం కొట్టేలా గురి ఉండేందుకు ఇలా కోచ్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు