'ఆ వార్తలు నా కుటుంబాన్ని బాధించాయి'

27 Feb, 2021 16:46 IST|Sakshi

సిడ్నీ: టీమిండియాతో ముగిసిన  బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీని 2-1 తేడాతో ఆసీస్‌ ఓడిపోయిన తర్వాత ఆ జట్టు ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్లతో లాంగర్‌కు పొసగడం లేదని.. అతని ప్రవర్తనతో వారు ఇబ్బందులకు గురవుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. డ్రెస్సింగ్‌ రూమ్‌లో లాంగర్‌ ఆటగాళ్లతో ముభావంగా ఉండడం... తాను ఏం చెబితే అది చేయాలని.. ముఖ్యంగా గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో బౌలింగ్‌ విషయంలో జోక్యం చేసుకొని అనవసర సలహాలు ఇచ్చేవాడని.. ఆసీస్‌ బౌలర్లు కూడా అతని తీరుతో సంతృప్తిగా లేరంటూ పేర్కొంది.

ఈ విషయాలను తాను సీరియస్‌గా తీసుకున్నానని.. జట్టుతో తనకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తానని లాంగర్‌ అప్పట్లో స్పందించాడు. అయితే తాజాగా ఆటగాళ్లతో కోచ్‌గా తన ప్రవర్తన బాలేదంటూ మీడియాలో మరోసారి వార్తలు లీక్‌ అవడం తనను బాధించిందని లాంగర్‌ తెలిపాడు. ఈ వార్తలతో తాను మానసికంగా కుంగిపోతున్నానని.. నా ఫ్యామిలీకి ఈ విషయాలు తెలిసి బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

''నా వరకు నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఎన్నో ఏ‍ళ్లు ఆటగాడిగా జట్టుకు సేవలందించా. ఆటగాడిగా ఉన్నప్పుడు రాని విమర్శలు కోచ్‌ పదవిలో ఉన్నప్పుడు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. టెస్టు సిరీస్‌ ముగిసిన రెండు వారాలకు ఆటగాళ్లతో నా ప్రవర్తన బాలేదంటూ వార్తలు వచ్చాయి. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆటగాళ్లు లేక అసిస్టెంట్‌ కోచ్‌ నా వద్దకు వచ్చి సమస్యను చెప్తే సరిపోతుంది. ఈ విషయం వాళ్లకు అప్పుడే చెప్పా. నేను ఎక్కడ పనిచేసినా నిజాయితీతో ఉంటూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. బహుశా నేను ఏంచుకన్న దారి ఆటగాళ్లకు నచ్చలేదు. అందుకే వారు నాతో సరిగా ఉండలేకపోయారు.

అయితే పదే పదే అదే విషయాన్ని గుర్తు చేస్తూ మీడియాలో కథనాలు లీక్‌ అవడం భాదించింది. చివరకు నా భార్య కూడా ఇన్ని అవమానాలు పడుతూ ఆసీస్‌ సీనియర్‌ జట్టుకు కోచ్‌గా పనిచేయడం అవసరమా అని ప్రశ్నించింది.  నేను మాట్లాడే మాటలు సూటిగా ఉండొచ్చు.. కానీ నాకు మనసు ఉంటుంది. పైకి అది గట్టిగా కనిపించినా.. లోపల మాత్రం చాలా బాధ ఉంది. ఆటగాళ్లతో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు నేను ఎప్పటికి సిద్ధమే'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: కోచ్‌గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా?
ఆసీస్‌ జట్టులో విభేదాలు.. కారణం అతనే!

మరిన్ని వార్తలు